banner 6 1

114

ముందుమాట

వాస్తు శాస్త్ర ప్రియులకు, వాస్తు గురించి తెలుసుకోవాలనుకుంటున్న వారికి సవినయముగా తెలుపుకుంటున్న ముందుమాట. ఏనాడు నేను వాస్తు శాస్త్రంపై పుస్తకం వ్రాయాలని సంకల్పించలేదు. నా రచన బాగుంటుందని వాస్తు శాస్త్రంపై వెంటనే ఓ పుస్తకం విడుదల చేయమని నన్ను కోరారు. అప్పటికే వాస్తు శాస్త్రంపై ఎన్నో పుస్తకాలు వెలువడుతున్నాయి. ఇక నా పుస్తకం ఎందుకు దండగ అని ఊరుకున్నాను. ఎవరు పుస్తకం వ్రాసినా ఒక్కటే ప్రజలకు వాస్తు శాస్త్రంపై అవగాహన పెరిగితే చాలు అని నా ఆలోచన. ఈ కాలంలో వాస్తు పుస్తకాలు మార్కెట్లో ఎక్కువై ప్రజలు ఎవరి పుస్తకం కొనాలో అని అయోమయంలో ఉన్నారు. మూస పద్ధతి ఎక్కువగా ఉన్నది. ఇటువంటి పరిస్థితులలో నేను వాస్తుపై పుస్తకం విడుదల చేయటం వద్దని అనుకున్నా, అభిమానుల వత్తిడి, నిర్మొహమాటంగా నేను చాలా విషయాలను బయట పెడతానని పుస్తకం విడుదల చేయమని వత్తిడితో నాలో కదలిక వచ్చింది. ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా పుస్తకం విడుదల చేయాలని సంకల్పించాను. అప్పటికే నా దగ్గర 2000 పేజీల వాస్తు శాస్త్ర పరిశోధన సారం తయారుచేసుకున్నాను. అనేక వాస్తు శాస్త్ర పండితులను, సివిల్ ఇంజినీర్లను కలిసి ఓ పద్ధతి ప్రకారం అందరికీ అర్థం అవ్వాలనే సంకల్పంతో పుస్తకం తయారుచేయాలని సంకల్పించాను. ప్రజలకు, చదువరులకు సులభంగా వాస్తుశాస్త్రం అర్థం కావాలని, ముఖ్యంగా వాస్తుశాస్త్రం అంటే ఏమిటి అనే విషయాలు, వాస్తు లేకుండా బ్రతకలేమా, వాస్తు పాటించినచో ఎంతవరకు ఆనందాన్ని పొందగలము ఇత్యాది విషయములు సవివరముగా లోపలి పేజీలలో పొందుపరచడమైనది.

ఆశ్చర్యకరమైన విషయాలు నా పరిశోధనలో బయట పడ్డాయి. నా అనాలసిస్ అంతా సవివరముగా తెలుసుకున్న వాస్తు మిత్రులు ఇతర శ్రేయోభిలాషులు నేను పడిన కష్టమును చూసి ఆశ్చర్యపోయారు. వాస్తుశాస్త్ర పరిశోధనకు నేను పెట్టిన ఖర్చుచూసి నన్ను ఎంతగానో మందలించారు. ఇంత ఖర్చు పెట్టేబదులు ఓ చక్కటి ఇల్లు నిర్మించుకొని బ్యాంకులో ధనం నిల్వ చేసుకొని ఉంటే ఎంతో బాగుండేది కదా అని నాకు హితభోదచేశారు. అయితే ముందునుంచి నేను ఎదయినా విషయం అంటూ పట్టుకుంటే వదిలేరకం కాదు, ధనం, సమయం ఎంతపోయినా వెరవను. ఏదో సాధించాలి, అదే పట్టుదల. దాని ఫలితమే ఈ సమగ్ర ‘వాస్తు విజ్ఞానం’, పుస్తకం వ్రాయడమనేది ఎంత కష్టమో రచయితలకు మాత్రమే తెలుస్తుంది. ఇతరులకు తెలియాలంటే కష్టం. పుస్తకం వ్రాయు సమయంలో ఇతర ఆలోచనలు ఏమీ ఉండకూడదు. ప్రశాంత వాతావరణం కలిగివుండాలి. వేరే ఏ వ్యవహారాలు దరిచేరనీయ రాదు. మనం సన్యాసులం కాదు. సంసారులం. అనేక సమస్యలు మనకు ఉంటాయి.

ఈ పుస్తకంలో, రచనలో, విషయాలలో, శాస్త్రంలో, నా అంచనా, ఆలోచనలలో ఏమైన లోపాలు ఉన్నట్లయితే మీరు తెలిపినచో సవినయముగా స్వీకరించి సరిదిద్దుకుంటాను. ఏ రచయితకైనా విమర్శకులు ఓ చక్కటి పునాది వంటివారు.