banner 6 1

123

సౌరశక్తి = వాస్తుశక్తి

ఈ రోజులలో విజ్ఞాన శాస్త్రవేత్తలంతా సౌర శక్తి వినియోగాన్ని గూర్చి విశేష ప్రచారం చేస్తున్నారు. సౌర శక్తి అంటే సూర్య కిరణాల నుండి మనకు లభించే శక్తి అని తెలుసుకున్నాం.

ఆ సౌర శక్తి అనేక రంగాలలో అనేక రూపాలలో మనకు ఉపయోగ పడుతుంది. పౌర శక్తి అనేది ఒక అక్షయపాత్ర. మనం ఎంత కాలం ఎన్ని విధాలుగా ఉపయోగించు కొన్నా ఆ సౌర శక్తి నిధులు తరగవు ఆ సౌర శక్తి వరప్రసాదంలో ప్రాణ వాయువు అనే ఆక్సిజన్ ఒకటి. అనుక్షణం సమస్త ప్రాణికోటికి ప్రాణవాయువు (ఆక్సిజన్) అత్యవసరం. ప్రాణవాయువు పీల్చనిదే ఏ ఒక్క ప్రాణీ రెప్ప పాటుకాలమైనా జీవించదు. అలాటి ప్రాణవాయువు సూర్యకిరణాల నుండి మాత్రమే మనకు లభిస్తుంది. సృష్టిలో మరి ఏ యితర పదార్ధాల నుండి లభించదు. మనం లోపలికి పీల్చుకొనే గాలిలో తేలియాడే అణు సముదాయం సూర్య కిరణాల నుండి లభ్యమయ్యే ప్రాణవాయువును తమలోనికి పీల్చుకొని నిలువ చేస్తాయి. మనం శ్వాసను లోనికి పీల్చు కొనేట ప్పుడు ఆ ప్రాణవాయువుతో కూడిన అణు సముదాయం మన ఊపిరి తిత్తుల లోనికి ప్రవేశించి శరీరాన్ని శక్తివంతం చేస్తుంది. ఈ సూర్య కిరణాలు ప్రాణవా యువునేగాక ఎన్నో అమూల్యమైన ఔషధగుణాల లవణాలు, విటమినులు, పోషకశక్తులుగల అల్ట్రావైలెట్ కిరణాలు ఇన్ఫ్రారెడ్ కిరణాలనుకూడా విడుదల చేస్తాయి. ఈ కిరణ సమూహాలు మానవ జాతి మనుగడకు ఇతర ప్రాణులు వర్ధిల్లడానికి ఎంతో అవసరమైనవి. అయితే ఈ విధమైన సౌర శక్తి, వాస్తు శక్తిగా యేవిధంగా రూపాంతరం చెందుతుందో పరిశీలిద్దాం.మయవిశ్వకర్మ మతానుసారం మానవులు తమకు నివాస యోగ్యంగా భావించి యెంచుకొన్న భూమికి “వాస్తువు ” అని పేరు. అట్టి వాస్తువునకు అధి దేవత వాస్తు పురుషుడు. వాస్తు పురుషుడనగా సూర్యుడేనని శాస్త్రాలు చెపుతు న్నాయి.

”విశ్వకర్మా సహస్రాంశోః” అనగా విశ్వకర్మయే సూర్యుడని శాస్త్ర ప్రమాణం. ఆ విధంగానే “వాస్తోష్పతిర్విశ్వకర్మా” అనగా విశ్వకర్మ అనగా వాస్తు పురుషుడనియు, వాస్తు పురుషుడనగా సూర్యుడనియు శాస్త్రాలు వివరిస్తు న్నాయి. వాస్తు పురుష గమనం కూడా సూర్య గమనాన్నీ అనుసరించే ఉంటుంది.

అతీంద్రియ శక్తి సంపన్నులైన విశ్వకర్మాది శిల్ప ఋషులు అనేక ఖగోళ పరిశోధనలు జరిపి యేయే కాలములయందు సూర్యకిరణ ప్రసారం యేయే రీతులలో జరుగుతుందో ఆయా కాలములందు ప్రసరించే సూర్యకిరణాల నుండి వెలువడే కాంతి తరంగాల ప్రభావం తరంగ ప్రసారదైర్ఘ్యం ఎట్టిదో, యే గుణాలు కలిగి ఉంటుందో, ఆ విధానమంతా వాస్తు పురుష స్వరూపం పేరుతో గుప్త పరచి మనకు అందించారు. కాబట్టి సూర్య కిరణ ప్రసార జన్యమైన సౌరశక్తి’యే భూమి అనబడే వాస్తువు నందు వాస్తు పురుష స్వరూపమగు వాస్తుశక్తిగా రూపాంతరం చెందుతూ ఉంది. పిండితార్ధమేమనగా ఈ భూమి అని పిలువబడే “వాస్తువును” వాస్తు క్షేత్రమందలి గాలిని సూర్య కిరణజన్య మైన శక్తి, శక్తివంతం చేస్తుంది. ఈ విధంగా సౌరశక్తి వాస్తుశక్తిగా రూపాంతరం చెందుతూ ఉంది భూమి అనగా గృహాది నిర్మాణాలకు దిక్సాధనాది పరిశోధన ద్వారా శుద్ధపరచి స్వీకరించిన క్షేత్రం. ఈ క్షేత్రాన్నే వాస్తువు అని గ్రహించాం. అట్టి క్షేత్రానికి వాస్తు పురుషుడు అధి దేవత. అయితే ఆకాశంలో వెలుగొందే వాస్తు పురుష స్వరూపుడైన సూర్యునికి భూమండలం మీద గల వాస్తువు అనేపేరు గల క్షేత్రానికి అనుసంధాన మేవిధంగా యేర్పడుతుంది? అంటే కిరణ ప్రసారంచేత అని ఋజువైనది. ఈ ఆకాశ మండలం గల సూర్యుడనే వాస్తు పురుషునకు భూమండలం మీద గల వాస్తు పురుషునకు బింబ ప్రతిబింబ న్యాయం వర్తిస్తుంది. అందు చేతనే వారిద్దరికి అభేదం చెప్పబడినది. ఉదా: ఒకచోట ఒక నీటితో నిండిన వంద కుండలు వరుసలుగా పేర్చబడి ఉన్నాయని భావించండి. ఆకాశంలో వెలుగులు విరజిమ్మే సూర్య భగవానుడు ఆ కుండలయందు సంపూర్ణ సూర్యబింబముగా ప్రకాశిస్తాడు. పై విధంగానే ఆకాశంలో వెలుగొందే వాస్తు పురుషుడు భూమండలం పై వాస్తు క్షేత్రంలో వాస్తు పురుష స్వరూపుడుగా అంతర్హితుడై వ్యాపించియుండి వాస్తు శక్తులను ప్రసాదిస్తాడు.

ఈ వివరణననుసరించి ఆకాశంలో యున్న వాస్తు పురుష స్వరూపుడైన సూర్య భగవానుడు భూమండలం మీద “వాస్తుక్షేత్ర” స్వరూపుడైన వాస్తు పురుషునికి తన బలీయము, అద్భుత శక్తిసమన్వితమైన సూర్య కిరణాలనబడే హస్తాల ద్వారా అద్భుత శక్తులను అందిస్తున్నాడు.