banner 6 1

125

వాస్తు శాస్త్ర పురాణము

పూర్వ కాలంలో అంధకాసురడనే రాక్షసుడు ముల్లోకాల వాసులను ముప్పు తిప్పలు పెట్టుచుండెను. అప్పుడు లోక సంరక్షణార్థం పరమేశ్వరుడు ఆ రాక్షసునితో యుద్ధం చేశాడు. ఆ సమయంలో శివుని లలాటం నుండి రాలిన ఒక చెమట బిందువు భూమిపై పడి దాని నుండి భయంకరమైన కరాళవదనంతో ఒక గొప్ప భూతం ఉద్భవించి క్రమ క్రమంగా భూమి, ఆకాశాలను ఆవరించసాగింది. ఆ మహాభూతాన్ని చూసిన ఇంద్రాది దేవతలు భయభ్రాంతులయ్యారు. బ్రహ్మదేవుని శరణువేడారు. సర్వలోక పితామహుడు అయిన బ్రహ్మ, దేవతలను ఊరడించి ‘‘ఆ భూతమును ఆధోముఖంగా భూమి యందు పడవేసే విధానం చెప్పాడు. బ్రహ్మదేవుని ఆనతి ప్రకారం దేవతలందరూ ఏకమై ఆ భూతమును పట్టి ఆధోముఖంగా క్రిందకు పడవేశారు. ఆ భూతం భూమిపై ఈశాన్య కోణమున శిరస్సు, నైఋతి కోణమున పాదములు, వాయువ్య, ఆగ్నేయ కోణాలందు బాహువులు వుండునట్లు అధోముఖంగా భూమిపై పడింది. అది తిరిగి లేవకుండా దేవతలు దానిపై ఈ విధంగా కూర్చున్నారు.

శిరస్సున -శిఖి (ఈశ)

దక్షిణ నేత్రమున -పర్జన్య

వామనేత్రమున- దితి

దక్షిణ శోత్రమున -జయంత

వామ శోత్రమున- జయంత

ఉరస్సున (వక్షమున) -ఇంద్ర, అపవత్స, అప, సర్ప

దక్షిణ స్తనము -అర్యమా

వామ స్తనమున -పృథ్వీధర

దక్షిణ భుజమున -ఆదిత్య

వామ భుజమున- సోమ

దక్షిణ బాహువున -సత్య, భృశ, ఆకాశ, అగ్ని, పూషా

వామ బాహువున -పాప యక్ష రోగ, నాగ, ముఖ్య, భల్లాట

దక్షిణ పార్శ్వకామున -వితధి, గృహక్షత

వామ పార్శ్వకామున -అసుర, శేష

ఉదరమున- వివస్వాన్, మిత్ర

దక్షిణ ఊరువున- యమ

వామ ఊరువున -వరుణ

గుహ్యమున -ఇంద్ర జయ

దక్షిణ జంఘమున -గంధర్వ

వామ జంఘమున -పుష్పదంత

దక్షిణ జానువున -భృంగరాజ

వామ జానువున -సుగ్రీవ

దక్షిణ స్పిచి -మృగబు

వామ స్పిచి -దౌవారిక

పాదముల యందు- పితృగణము

ఇంతమంది దేవతల తేజస్సముదాయంతో దేదీప్యమానంగా వెలుగొందుతున్న ఆ భూతాకార అద్భుతాన్ని తిలకించిన బ్రహ్మదేవుడు దాన్నే ‘వాస్తు పురుషుడు’ గా సృష్టిగావించాడు.

భాద్రపద బహుళ తదియ, మంగళవారం, కృత్తికా నక్షత్రము, వ్యతీపాత యోగము, భద్రనా కరణము గుళకతో కూడిన కాలంలో ఆ వాస్తు పురుషుడు జన్మించాడు. ఏ అపకారం చేయని నాపై అధిష్ఠించి ఈ దేవతలు పీడించుచున్నారు. వీరి నుండి నన్ను కాపాడమని వాస్తు పురుషుడు బ్రహ్మదేవుణ్ణి వేడుకున్నాడు.

అప్పుడు బ్రహ్మదేవుడు సంతోషించి “వాస్తుపురుషా ! గృహములు నిర్మించునప్పుడు, త్రివిధమయిన గృహ ప్రవేశ సమయములందు, గ్రామ, నగర, పట్టణ, దుర్గ, దేవాలయ, జలాశయ, ఉద్యానవన నిర్మాణ సమయములందు ముందుగా నిన్నే పూజిస్తారు. అలా పూజించని వారికి దరిద్రముతో పాటు అడుగడుగునా విఘ్నములు చివరకు మృత్యువు కూడా సంభవించు” నని వాస్తు పురుషునికి వరమిచ్చాడు.

అంతేగాక వాస్తు పురుషుని పై అష్టదిక్కులలో వున్న దేవతలు తృప్తి పొందు విధంగా ఆయా స్థలాలలో నివసించే దేవతలు వారి వారి విధులు నిర్వహించుట వలన గృహస్థులకు సర్వ సుఖములు, సత్ఫలితాలు కలుగునట్లు ఆశీర్వదించాడు.

బ్రహ్మదేవుని ఆశీస్సుల ప్రకారము : ఈశాన్యమున – ఈశ్వరుడు (ఈశ), ఆగ్నేయమున – అగ్ని, నైఋతిన నిరృతి, వాయువ్యమున – వాయువు, తూర్పున – ఆదిత్యుడు, దక్షిణమున యముడు, పశ్చిమమున వరుణుడు, ఉత్తరమున – కుబేరుడు. అష్ట దిక్కులలో అధిష్ఠించిన ఈ దేవతలు తృప్తి చెందే విధంగా నిర్మణక్రమం ఉంటే ఆ గృహంలో నివసించే వాళ్ళు సర్వసుఖ సంపదలను పొందుతారు. ఇదీ వాస్తు – పురాణం.

ఈశాన్యములో పూజలు, పవిత్ర కార్యములు, ఆగ్నేయమున అగ్నిదేవునికి సంబంధించిన వంటావార్పు, నైఋతిన ఆయుధ సామగ్రి, వాయువ్యమున స్వతంత్ర్యా భిలాష చిహ్నములు, తూర్పున ఆదిత్యునికి ప్రీతికరమైన పనులు, యమస్థానమైన దక్షిణము శిరస్సు ఉంచి నిద్రించుట, కుబేర స్థానమైన ఉత్తరాన్ని దర్శిస్తూ మేలుకొనుట, వరుణ స్థానమైన పశ్చిమాన పాడిపశువులను పెంచుట మొదలైన విధులు ఆయా దిక్కుల్లో ఉన్న దేవతలకు తృప్తిని

కలిగిస్తాయి. ఈ సారాంశాన్ని ‘వాస్తుశాస్త్రం’ నియమాలు మనకు వెళ్ళడిస్తాయి.

గృహనిర్మాణాలు చాలా రకాలు. వీటిలో మనుష్యోపయుక్తములు, పశువులకు సంబంధించిన నిర్మాణాలు, పక్షులకు సంబంధించిన నిర్మాణాలు, దేవతలకు సంబంధించిన నిర్మాణాలు ఇలాగ అనేక విధాలుగా ఉన్నాయి. వాస్తు శాస్త్ర కర్తలు నిర్మాణాలను ముఖ్యంగా 4 భాగాలుగా విభజించారు. 1) సాధారణ మనుష్య నివాసములు 2) ప్రభు నిర్మాణములు 3) దేవతా నిర్మాణములు 4) సర్వ సాధారణ ప్రజోపయోగ నిర్మాణాలు. సామాన్యంగా ప్రతి గృహస్థులకు అవసరమైన సదుపాయములను గురించి మార్పులతో నిర్మాణాలు చెప్పబడియున్నవి.