కడప పట్టణానికి ఉత్తర వాయవ్యంగా మూడు కి.మీ. దూరాన పాత కడపలో శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి క్షేత్రముంది.
తిరుమల క్షేత్రానికి వెళ్ళు యాత్రికులు ముందు ఈ కడప రాయుని దర్శించే వాడుకను బట్టి తిరుమల క్షేత్రానికి మొదటి గడపనేది జనవాక్యం. ఈ స్వామివారిని అన్నమయ్య, క్షేత్రయ్య తమ కీర్తనల్లో కడపరాయుడనీ, తిరువేంగళరాయుడనీ సంబోధిస్తూ స్తుతించారు.
మట్లరాజుల్లో ప్రముఖుడైన మట్ల అనంతభూపతి పశ్చిమ దిశనున్న గోపురాన్ని కట్టించారు. ఇదియే ప్రధానమైన ఆలయ ప్రవేశ ద్వారం. ఆలయ ముఖమంటపం, అంతరాళం, గర్భగుడి అని మూడు భాగాలుగా కట్టబడింది.
ఆలయ ఆవరణమందు శ్రీ స్వామివారి గుడికి ఎడమవైపున శ్రీ పద్మావతీ అమ్మవారి ఆలయం వుంది. ఈ గుడికి కూడా ముఖ మండపం, అంతరాళం, గర్భగుడి, వున్నవి. మండపం పై కప్పుకు రాతి బల్లులు చెక్కబడినవి. మీద బల్లిపడినవారు స్నానంచేసి తడిబట్టల్తో ఆ బల్లుల్ని తాకితే దోషం పోతుందనే విశ్వాసం ఆ ప్రాంత ప్రజలకుంది.
ఆదిలో ప్రతిష్ఠింపబడిన అమ్మవారి విగ్రహాన్ని మతద్వేషులు పగులగొట్టగా మరొక విగ్రహం ప్రతిష్ఠింపబడింది. ఆలయ ఆవరణంలో ఉత్తర వాయవ్యంలో ఎత్తుగా విష్వక్సేన మందిరం, ఆండాళ్ వారి మందిరం, నాగులపీఠం ఏర్పాటు చేయబడ్డాయి. స్వామి వారి ఆలయానికి వాయవ్యంలో ‘హనుమత్ పుష్కరిణి’ వుంది. కర్నూలు-కడప కాలువ (కె.సి.కెనాల్) వీరు కోనేరు లోకి పారి వెలుపలికి పోవు ఏర్పాటుంది.
వాస్తుదృష్టితో ఈ ఆలయ నిర్మాణాల్ని కొంచెం పరిశీలిద్దాం. ‘వాయవ్య పుష్కరిణి ధనాగమన నివారిణి’ అన్న సూక్తి ననుసరించి శ్రీ కడపరాయుని రాబడిని ఇది ఖండిస్తోంది. ఆలయ ఆవరణంలో ఎత్తుగా నిర్మించిన విష్వక్సేన, ఆండాళ్, నాగ విగ్రహ పీఠికల వలన వాయవ్యం మెరక (ఎత్తు) అయింది. ఈ వాయవ్యం మెరక, ఆదాయానికి చురక. ఆలయ ఆవరణాన ఈశాన్యంలో ఒక మండపం కట్టి కప్పు వేశారు. ఈ ఈశాన్యం కప్పు పురోగమనానికి ముప్పు.
ఆలయానికి పశ్చిమ, దక్షిణ, ఉత్తర ద్వారాలున్నాయి. తూర్పు దిశలో ద్వారం లేదు. ఇలాగ తూర్పున ద్వారాలు లేని ఆలయాల స్థితి ఎలా ఉంటుందో ఎవరైనా పరిశీలించొచ్చు. అవి పతనావస్థలో ఉంటాయి.
ఆవరణంలో పశ్చిమ దిశన ఖాళీ స్థలం ఎక్కువగా వుంది. ఇందులో సగమైనా తూర్పున లేదు. ఇదికూడ ఆలయ అభివృద్ధికి అడ్డంకి. ఈ ఆలయంలోని విగ్రహం తిరుపతిలోని వేంకటేశ్వర విగ్రహాన్ని పోలివున్నా ఆలయానికి వాస్తుబలం లోపించడంతో యోగించలేదు. అసలు స్వామివారు పశ్చిమాభిముఖులై వున్నారు. పశ్చిమాభిముఖంగా ఉన్న దేవతల ఆదాయం అంతంత మాత్రమే ఉంటుంది.

