banner 6 1

128

గతకాలం నుండి నేటికిని మంచి స్థితిలో ఉన్న ఆలయాలు కొన్నయితే, కేవలం ఆనాటి ఖ్యాతికి స్మృతి చిహ్నాలుగా మాత్రమే మిగిలియున్న ఆలయాలు మరికొన్ని. ఆలయాలు కానీ, ఆవాసాలు (ఇళ్ళు) కానీ కాలక్రమాన జరిగే మార్పులతో ఉత్కృష్ట దశకో లేదా నికృష్ట దశకో చేరుకొనడం అనుభవంలో కనుగొంటున్నాం. వాస్తురీత్యా మంచి మార్పులు జరిగితే మంచి ఫలితాలూ, చెడ్డ మార్పులు జరిగితే చెడు ఫలితాలూ కలుగుతున్నాయి. మొదటవుండిన మేలైన వాస్తు కదలిపోయి, ఈనాడు శిథిలదశకు చేరుకొన్న కొన్ని కట్టడాలు మనకు కనిపిస్తాయి.

కంచిలోని శ్రీ వరదరాజస్వామి వారి గుడిలో గడిచిన కాలంలో వుండిన కొన్ని మంచి వాస్తు లక్షణాలు శిథిలదశకు చేరుకున్నాయి. ప్రధాన ఆలయానికి ఈశాన్యాన వున్న కోనేరే ఇందుకు ఉదాహరణం. సత్ఫలితాలిచ్చే ఆ కోనేరు శిథిలమై నీరు లేనిదయింది. వాయవ్యాన “అనంత సరసి” అను పేరున వున్న కోనేరు మంచి ఫలితాలనివ్వనిదైనా ప్రాముఖ్యతను సంతరించుకొన్నది. మొత్తం ఆలయవాస్తును కాస్తా పరిశీలిస్తే ఆలయం తూర్పు, పడమరలకు పొడవున్న స్థలంలో వెలసింది- మంచిదే. దక్షిణ, పశ్చిమ స్థలాలు తక్కువగా వుండి, తూర్పు, ఉత్తరములందున్న ఖాళీస్థలం ఎక్కువగా వుంది – శుభలక్షణమే.

వెలుపలనున్న ప్రధాన ప్రాకారంగాక ఆలయానికి చుట్టూ చతురస్రంగా మరొక ఉపప్రాకారముంది. దీని వెలుపల చుట్టునూ నడక గల స్థలముంది.

ప్రధాన ఆవరణానికి తూర్పున. ప్రధాన ఆలయానికి ఈశాన్యంలో “తిరుమంగయాళ్వార్ కోయల్” అనే గుడి వుంది. అది పాడుబడింది. ఎందుకిలా జరిగింది? నీరులేని కోనేరు ఈ తిరుమంగయాళ్వార్ కోయల్కు ఆగ్నేయంలో వుండటమే అందుకు కారణం.

ఇక ప్రాకార గోపురాల విషయానికొద్దాం. ప్రధాన ప్రాకారానికి తూర్పు ఆగ్నేయంలో ఒక గోపురముంటే పశ్చిమ నైరృతిలో ఒక గోపురముంది. నైరృతిలో ఎత్తైన కట్టడాలు వుండడం మంచిదే కానీ, అక్కడనుండి నడక కష్టాలను కలిగించేది కదా! అలాగే తూర్పు ఆగ్నేయం నడక కూడా సత్ఫలితాలను భగ్నం చేసేదే కదా !

తూర్పు, ఉత్తరాలలోని ప్రాకారం కన్నా దక్షిణ ప్రాకారం ఎత్తుగా వుంది. మంచిదే.

ఇక గుడిలోకి ప్రవేశిద్దామా?

శ్రీ వరదరాజస్వామివారి సన్నిధానమునకు పైకి వెళ్ళే ప్రధాన ద్వారం తూర్పు ఆగ్నేయమయింది. అక్కడనుండి ప్రదక్షిణంగా వరదరాజస్వామి ఆలయానికి పశ్చిమ ముఖంగా వెళ్ళి, పశ్చిమాభిముఖుడై యున్న స్వామి వారిని దర్శిస్తున్నాం.

తూర్పు ఆగ్నేయంలో వున్న ద్వారానికి ఎదుట తూర్పు ఆగ్నేయం పెంపుతో ఇరువైపుల ఉత్తర దక్షిణ దిక్కులకు సోపానాలు (తాపలు) ఉన్న మంటపముంది. ఇది మంచిదికాదు.

లోపలవున్న శ్రీ నరసింహస్వామి వారి ఆలయానికి నైరృతిలో మురికి నీరు చేరే ఒక గొయ్యి వుంది. ఇది నరసింహస్వామి వారి శుభాలను నరికివేస్తుంది.

ఇక పెరిందేవి అమ్మవారిని దర్శిద్దాం. ఈ గుడి ప్రధాన ఆలయ ప్రాంగణంలో నైరృతి మూలలో దక్షిణ, పశ్చిమ ప్రహరీలకు ఆనుకొని నిర్మించబడింది. దీనికి తూర్పు ముఖద్వారముంది. ముఖమండపం తూర్పున వుంది. ఈ ముఖ మండపానికి, ఆలయానికి నడుమ ఉత్తరానికి గూడా ఒక ద్వారముంది. ఇది శుభమే.

కానీ, అమ్మవారి ఆలయానికి తూర్పున యున్న ఖాళీస్థలంలో ఆగ్నేయంగాఒక బావి వుంది. ఈ బావి, వాయవ్వంలోని కోనేరు, నేర్పతి నడక, అనేవి శుభాలిచ్చేవి కావు. తత్ఫలితమే 1985లో లక్షల విలువజేసే అమ్మవారి సొమ్ముల దొంగతనం. కొంతకాలం పిమ్మట చోరీ సొమ్ములో కొంతభాగం దొరికిందంటున్నారు.

అనుభవ వాస్తు అనలు కొనలు సాగే ఈ కాలంలో గతంలో జరిగిన పొరపాట్లను సవరించుకొను ప్రయత్నాలకు స్వాగతం పలకడం సమంజసం. ఈశాన్యంలోని పుష్కరిణిని పునరుద్ధరించుకొని, వున్న లోటును మిన్నయగు పద్ధతిలో సరిదిద్దుకొంటే స్వామివారి మహిమ ఇనుమడిస్తుంది. లేకుంటే వరదుడగు శ్రీ వరదరాజస్వామి వారికి రాబడి తగ్గిపోవడం తప్పదు.