banner 6 1

130

వాస్తుశాస్త్ర విరుద్ధంగా వున్న గృహాన్నైనా, గుడిసెనైనా వాసుదేవుడు కూడా రక్షించలేడనేందుకు తిరుపతి సమీపాన ఉన్న శ్రీనివాస మంగాపురంలో శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి ఆలయం ఒక నిదర్శనం. 30-1-85న ఆ గుడిలో దొంగలు పడి ఇరువురు గార్డులను చంపి, స్వామి వారి సొమ్మును అపహరించిన విషయం అందరికీ గుర్తుండే వుంటుంది. ఆ దేవాలయం పూర్వము శాస్త్ర సమ్మతంగా నిర్మింపబడినను ఇటీవలి కాలంలో శాస్త్ర విరుద్ధంగా కొన్ని కట్టడాలు కట్టి ఇక్కట్టులను కొని తెచ్చు కొన్నారు.

1) గాలిగోపురం ముందరి ప్రహరికి, ఈశాన్యంలో మెరకగా మట్టి దిబ్బవేసి దానిపై పూల మొక్కల్నివేశారు. అందువల్ల పల్లంగా వుండాల్సిన ఈశాన్యం మెరక (ఎత్తు) అయింది. ఈ దోషం అభివృద్ధి ఆగిపోయేందుకు ఆసరా అయింది.

2) ఆవరణంలో గాలిగోపురం ప్రక్కగా ఆగ్నేయంలో నుయ్యివుంది. దీనివల్ల చోర, ఆగ్ని, అనారోగ్య బాధలు, అనవసర తగాదాలు సంభవిస్తున్నాయి. మరి తిరుమల ఆలయంలో కూడా ఆగ్నేయంలో బావి వుంది కదా? అనే అనుమానం చదువరులకు కలుగవచ్చును. కానీ అచ్చట ఈశాన్యాన మరొక బావి, ఉత్తరంలో రెండు బావులున్నవి. అయినా ఆగ్నేయ దిశలోని నుయ్యి వలన అచ్చట కూడా కొన్ని దుష్ఫలితాలు కలుగు తూనే వున్నాయి. స్వామి వారి ధనం ఎంతో

దుర్వ్యయం అవుతూనే వుంది. పూజారులు, మహంతువారు కొన్ని సమస్యలతో స్వామివారి విషయమై హైకోర్టు కెక్కడం ఎల్లర కెరుకే. ఈ ఆగ్నేయ దిశలోని బావి 1890లో త్రవ్వారు.

3) కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయం గర్భగుడిలో 1980వ సంవత్సరంలో తూర్పు, ఉత్తరాల గోడలను ముట్టుకొని ఒక గదిని కట్టారు. ఈశాన్యం మూతపడడం అంటే ఇదే. ఈశాన్యాన్ని బంధిస్తే శ్వాసను బంధించినట్లే.

4) గర్భగుడిలోనికి ప్రవేశం పైపులతో పార్టీషన్ ఏర్పాటుచేసినందున లోనికి ప్రవేశించడం తూర్పు ఆగ్నేయంగా జరుగుతూవుంది. ఈ నడక ఆర్థిక నష్టాలకు వేడుక.

5) ఆవరణమందు దక్షిణంలో నైరృతి నుండి ఆగ్నేయం వరకు 12 అడుగుల వెడల్పున 2 అడుగుల పల్లముంది.

6) ఈ విధంగానే పశ్చిమ నైరృతి నుండి వాయవ్యం వరకు పల్లముంది.

7) ఆవరణలో దక్షిణం కన్నా ఉత్తరం మెరకగా వుంది. ఈ విరుద్ధ లక్షణం వల్ల ధనహాని, వ్యాధుల బాధలు, మృత్యుభయం వుండి తీరుతాయి. ఉత్తరం ఎత్తు యజమానిని ఉత్తచేతులతో నిలుపుతుంది.

8) గుడి పరిసరాల్ని పరిశీలిస్తే దక్షిణంలో 10 అడుగులకు పైగా పల్లమున్న (తగ్గు) పంట పొలాలున్నవి.

9) ఆవరణములో గాలిగోపురానికి ఉత్తరాన తూర్పుగోడనంటుకొని ఎత్తయిన, విశాలమైన ప్లాటుఫారాన్ని నిర్మించి దాని దగ్గరలో రాతిస్తంభాలను పాతారు. దానివల్ల గుడికి ఈశాన్యం బరువైంది. లోపాలతో కూడిన ఈ కట్టడాలు ఇటీవలి కాలంలో కట్టినట్లే తెలిసింది.

ఈ గుడిలో హత్య చేయబడిన ఇరువురిలో ఒకరైన రామకృష్ణా రెడ్డి కాపురముండిన ఇంటిని పరిశీలించడం జరిగింది. ఆ ఇంటికి ఉత్తర వాయవ్యం పెరుగుట వల్ల ఈశాన్యంతరిగిపోయింది. ఇందువలన ధన, సంతాన, ప్రాణహానులు కలగడం సహజమే. అగ్నికి వాయువు తోడైనట్లు ఉత్తర వాయవ్యంలో పొయ్యి పెట్టుకొని వంట చేసుకొంటున్నారు.

ఆ ఇంటికి ఉత్తరంలో అంటుడు మిద్దె వుండి దక్షిణం వైపుకొన్ని వందల అడుగుల బయలు స్థలము వుంది. ఉత్తరం మాతృస్థానం. అట్టి దిశలోపిస్తే స్త్రీ సుఖపడదు. ఇంటి పశ్చిమపు ప్రహరి గోడ నైరృతి పెరుగుతూ సాగింది. ఈ పశ్చిమ నైరృతి పెంపు పురుషునికి దుర్వర్తన కలిగించి దుర్మరణం పాలు చేస్తుంది.