వాస్తుశాస్త్ర దోషాలను అతిక్రమించడం ముఖ్యమంత్రులకు గూడా శక్యం కాదని బ్యాండ్ బజాయించి మరీ చాటుతోంది గ్రీన్ ల్యాండ్. ఇది హైదరాబాద్ లోని బేగంపేటలో మూడున్నర ఎకరాల విస్తీర్ణంలో నిర్మాణమై యున్నది.
ఏడుగురు ముఖ్యమంత్రులను పదవీకాలం పరిసమాప్తిగాక పూర్వమే పదవీచ్యుతులను చేసిన యశం గ్రీన్‌ల్యాండ్.
ఒక వ్యక్తికి కుంటి, గ్రుడ్డి, మూగ, చెవుడు మొదలుగాగల అన్ని అవలక్షణా లుంటే ఎలా వుంటుందో అలాగే ఈ గ్రీన్ ల్యాండ్‌ను కూడ అన్ని వాస్తు వక్రాలూ ఆక్రమించుకొన్నవి. ఆ వక్రాలు కొంచెం పరిశీలిద్దాం.
1) ప్రహరికి ఉత్తర వాయవ్యం పెరిగి మూత పడింది. ఈ దోషం చోర, అగ్ని భయాలతోబాటు అందు నివసించు వారికి స్థానభ్రంశం కలిగిస్తుంది. స్త్రీలపై దుష్ప్రభావం ప్రదర్శిస్తుంది.
2) ఉత్తరదిశలో ఈశాన్యంలోపించి, ఈశాన్యం వక్రించి నడక సాగింది. వక్రగతి పట్టిన చోట ఈశాన్యం మూతపడింది. ఈశాన్యం మూతపడటం వాస్తుదోషం.
3) గ్రీన్‌ల్యాండ్ ప్రహరి ఈశాన్యమూలకు ఎత్తయిన రాళ్ళగుట్టలుండి, నైరృతిలో పల్లం ఉన్నది.
సూక్తి :- నైరృతి పల్లం మరణానికి మూలం.
4) ప్రహరికి ఆగ్నేయం పల్లం, తూర్పు ఆగ్నేయంగా వెలుపలికి నడక వుండుట వల్ల కూడా చోరాగ్ని భీతియే గాక, ఆర్థిక దుస్థితికి కూడా దారితీస్తుంది.
5) దక్షిణ నైరృతి పెంపు ఉంది. ఈ వక్రత స్త్రీని వ్యాధిగ్రస్తురాలిగాను, దుర్వర్తన గలదిగాను, దుర్మరణం చెందేదిగాను చేస్తుంది.
6) పశ్చిమ నైరృతి నీచస్థానంలో, ప్రహరిగేటు పురుషుడిపై దుష్ప్రభావం చూపుతుంది. “పశ్చిమ నైరృతి ద్వారా పయనం- పురుషారిష్టాలకు కారణం”.
7) దక్షిణంలో పల్లం, ఉత్తరంలో మెరక వుండుటవలన ఆర్థికబలం వక్రించి తుదకు విక్రయింపబడుతుంది. ‘ఉత్తరం మెరక దరిద్ర దేవతకు పడక’.
ఇలాంటి వాస్తు వక్రతలుండే ఈ గ్రీన్‌ల్యాండ్ చరిత్ర నొకింత పరికింతము. సువిశాలమైన ఈ భవనంలో మొట్టమొదట గృహ ప్రవేశం చేసిన వ్యక్తి ‘ శ్రీ గిర్సన్’. నిజాం పాలనలో ఆయన రెవెన్యూ మెంబర్. ‘జానపద సంస్కృతి’ అంటే ఆయనకు మిక్కిలి మక్కువ. అందువలన భవన ప్రాచీన వైభవాన్ని పరిరక్షించే భావనతో దానిని ఆధునీకరించడానికి అభ్యంతరం చెబుతుండేవారు. ఆయన ఈ భవనాన్ని జానపద కళకు నిలయంగా మార్చారు.
అందంగా అలంకరించిన పులిచర్మాలు. ఏనుగు దంతాలవంటి ఆటవిక వస్తువులు భవనమంతటా కనపడేవి. ఛాతరీ నవాబు ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో ఈ భవనం ప్రశాంతతకు భంగం వాటిల్లే సంఘటన సంభవించింది. ముస్లింలకు అగౌరవం జరిగిందని ఆరోపిస్తూ ఇత్తెహాద్ ఉల్ ముస్లమాన్ (మజ్లిస్) మద్దతుదారులు ఈ భవనంపై దాడి జరిపి, దాన్ని పాక్షికంగా దగ్ధం చేశారు. ఆ తరుణంలో గిర్సన్ ఆ భవనంలోనే ఉన్నారు. పోలీసులు వలయంగా నిలబడి ఆ భవనాన్ని కాపాడారు. ఆ సంఘటన పిమ్మట దానిని ఎక్కువగా సైనిక సిబ్బంది. ఇతర అధికారులు వినియోగించు కునేవారు. తర్వాత కొంతకాలానికి శ్రీ బూర్గుల రామకృష్ణారావు నాయకత్వంలో పూర్తి స్థాయి పౌర ప్రభుత్వం ఏర్పడినప్పుడు “గ్రీన్‌ల్యాండ్” ఆయన అధికార నివాస గృహంగా ఉండేది. కానీ ఆయన కుమార్తెకు ప్రమాదం సంభవించడంతో ఆయన షాహీ మంజిల్ (ప్రస్తుత రాజభవన్) లోనికి మారారు.
హైదరాబాద్ రాజధానిగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తరువాత నూతన ముఖ్యమంత్రి శ్రీ నీలం సంజీవరెడ్డి ‘గ్రీన్‌ల్యాండ్’ లోనికి బస మార్చారు. ఆయన బాత్రూంలో కాలుజారిపడడం జరిగింది. ఆదీగాక శ్రీ రెడ్డిగారి కుమార్తె వివాహ శుభవేళలో వివాహవేదిక కరెంటు షార్ట్ సర్క్యూట్ కారణంగా దగ్ధమైంది. తన పదవీ కాలం పూర్తి కాకుండానే ఆయన. ఆ భవనాన్ని వదలి వేయవలసి వచ్చింది.
శ్రీ దామోదరం సంజీవయ్య ముఖ్యమంత్రి పదవి నలంకరించిన తరువాత ఈ భవంతిలో కాలు పెట్టి, కొంతకాలమే కొనసాగారు. మరల శ్రీ నీలం సంజీవరెడ్డి గారు అధికారంలోనికి వచ్చి ఈ భవనంలో నివాసమేర్పరచుకొన్నారు. కానీ ప్రభుత్వానికి ఆయన రాజీనామా చేశారు.
శ్రీ జలగం వెంగళరావు ముఖ్యమంత్రిగా, గ్రీన్‌ల్యాండ్‌లో ప్రవేశించారు. ఆయన ఏదో రీతిని వాస్తు సరిపెట్టుకొని, గోడకట్టి, భవనం ముందున్న ఖాళీస్థలాన్ని రెండు భాగాలుగా విభజించారు. ఔటుహౌసున్ను ప్రధాన భవనం నుండి వేరుపరచారు. అయినను పరిస్థితుల ప్రాబల్యం ఆయనను ఆ ఇంట ఉండనివ్వలేదు. ఆయన తన సొంత నూతన భవనంలో ప్రవేశించిన తరువాత గ్రీన్ ల్యాండ్ మరల అతిథి గృహంగా మారింది.
డాక్టర్ చెన్నారెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తరువాత ఈ భవనంలో ప్రవేశించి వాస్తురీత్యా అనేక మార్పులు గావించారు. అనేక నూతన నిర్మాణాలను చేయించారు.
కానీ అవి వాస్తుశాస్త్ర బద్ధంగా తెలిసిచేసిన మార్పులు కావు. తర్వాత తార్నాకలోని తన సొంత గృహంలోనికి డాక్టర్ చెన్నారెడ్డి గారు మారారు. పిమ్మట శ్రీ టి. అంజయ్య ముఖ్యమంత్రి అవడం, గ్రీన్‌ల్యాండ్‌లో చేరడం, అపహాస్యం పాలు కావడం, పదవి కోల్పోవడం మొదలగు విషయాలందరికీ విదితమే.

