భూమి యేర్పడడానికి, ప్రాణుల మనుగడ కొనసాగడానికి, సూర్యుడు ఆధారభూతుడు. ప్రాణికోటికి ప్రత్యక్షదైవమైన నక్షత్రమాయన. భారతదేశంలో ఒరిస్సా రాష్ట్ర మందు ఆయనకు ఒక ఆలయం నిర్మింపబడింది. అది కోణార్క దేవాలయంగా ప్రసిద్ధిగాంచింది. అపురూప శిల్ప సంపదతో భాసిల్లిన ఆ భాస్కరాలయం కారు మేఘాలు క్రమ్ముకొన్న సూర్యుని వలె కాంతి హీనమైంది. మేఘాలు ఏర్పడేందుకు కారకుడైన సూర్యుని క్రమ్ముకొన్న నీలిమేఘాలు స్వల్పకాలంలో తొలగిపోతాయి. కానీ నరుల కారణంగా ఏర్పడిన దుర్వాస్తు మేఘాలు ఈ కోణార్క ఆలయాన్ని శాశ్వతంగా ముసురుకొన్నాయి. ఏమిటా దుష్టవాస్తు ?
అచ్చట పరిసర ప్రాంతం కన్నా ఆలయం నిర్మించిన స్థలం పల్లం. ఆలయ నిర్మాణ భాగాలు ఉత్తరవాయవ్యాన్ని, దక్షిణ నైరృతిని పెంచి ఉత్తర ఈశాన్యాన్ని, దక్షిణ ఆగ్నేయాన్ని తగ్గించి వేశాయి. ఆలయాన్ని రథాకృతిగా తీర్చడం వల్ల తూర్పు భాగం ముందుకు పొడుచుకొని వచ్చి తూర్పు ఈశాన్య, తూర్పు ఆగ్నేయాలు ఖండించబడ్డాయి.
సూర్యాలయం నిర్మించిన తరువాత దానికి ఆనించి పశ్చిమాన చాయాదేవి మందిరం నిర్మించడానికి పూనుకొని విఫలులయ్యారు.
నైరృతిలో అసంపూర్తిగా ఆగిపోయిన ఛాయాదేవి మందరం పునాది ప్రధాన ఆలయం యొక్క పునాది కన్నా చాలా తక్కువ ఎత్తులోవుంది. ఆ మందిరానికి నైరృతిలో నున్న మాయాదేవి మందిరం మరింత పల్లంలో వుంది.
ప్రధాన ఆలయపు తూర్పు ద్వారానికి యెదురుగా తూర్పు నడకను అడ్డగిస్తూ ‘నాట్యశాల’ నిర్మింపబడటం వలన తూర్పు ద్వారం నిరుపయోగమయింది. తూర్పు నడకకు ఆటంకం ఏర్పడడం వలన పడమటి వైపున నిర్మించిన ప్రధాన ఆలయ గోపురం శిథిలమగుటకు అది హేతువయింది. దక్షిణం వైపున ఒక గేటుంది. అంటే దక్షిణం వైపున నడక వుండి, ఉత్తరం వైపున లేకుండా పోవడం, తూర్పున ద్వారముండి తరచుగా వాడుక, నడక లేకుండా పోవడం వలన ఆలయ శోభ, వైభవం క్షీణించాయి.
ఆగ్నేయంలో ఒక నుయ్యి వుంది. ఉత్తరాన కూడ ఒకనుయ్యి వుంది. కానీ ఆగ్నేయంలోని బావి ఈ ఉత్తరం బావి యొక్క మంచి ఫలితాన్ని తెంచి వేసింది. ఆగ్నేయాన ఒక నుయ్యి వుండుట వలన మాయాదేవి, ఛాయాదేవి మందిరాలు నైరృతి యందు పల్లంలో వుండటం వల్ల, క్షేత్ర చరిత్రలో చెప్పబడుచున్నట్లు ప్రధాన శిల్పులిద్దరు అపమృత్యువు పాలబడినారు. ఈ ఆలయం దిక్సూచికి చక్కబరచి నిర్మింపబడినా, పై వాస్తు వక్రతలు వికృతాట్టహాసంతో కోణార్కను శిథిలస్థితికి చేర్చాయి.

