banner 6 1

32

తగుపాళ్ళలో పంచ భూతాల యొక్క పరస్పర సంబంధమే వాస్తు. అనగా నింగి, నేల, నీరు, నిప్పు, గాలి అనే అయిదంశాలను మన గృహంలో తగిన విధంగా సమకూర్చుకొనడంలోనే మన జీవన విధానం ఆధారపడి వుంది.

శరీరానికి పనికొచ్చే ఎన్నో పదార్థాలు వున్నాయని శాస్త్రజ్ఞలు రుజువు చేశారు. ఉదాహరణకి ఉదయపు వేళ ఎండలో కాసేపు వుంటే మన దేహానికి కావలసిన “డి” విటమిన్ లభ్యమవుతుంది. ఈ “డి” విటమిన్ మధుమేహవ్యాధిని అదుపుచేస్తుందని రుజువయ్యింది. అంటే ఉదయభానుని కిరణాల్లో వున్న మనత మానవ మేధస్సు ఎదిగేకొలది విదితమవడం మొదలయింది. సూర్యకిరాణాల్లో వున్న మహత్తు వర్ణనాతీతం.

విజ్ఞానశాస్త్ర రంగంలో పురోగమించే కొలది మనిషి గృహాన్ని నిర్మించుకొనడం ఆరంభించి, భూమి, నీరు, వెలుతురు, గాలి, ఆకాశాలనే పంచభూతాల సమన్వయ నియమాలను సూత్రీకరించాడు. మనిషి జీవన విధానంలో ఇంటిని ఒక ప్రధాన శక్తిగా రూపొందించుకొని, దానికి “వాస్తువు” అని నామకరణం చేశాడు.

తూర్పు, పడమరలకు పొడవున్న భూమి పురుషస్థలమనీ, శ్రేష్ఠమైనదనీ కనుగొన్నాడు. సూర్యకిరణ ప్రసరణకు ఎదురుగా వుండుటే ఆ స్థలం విశిష్టతకు కారణం. ఎలాంటి అవరోధం లేకుండా సూర్యకిరణ ప్రసారం జరుగవలెననే తలంపుతోనే ఇంటికి తూర్పు దిశలో ఎత్తయిన చెట్లుగానీ, ఎత్తయిన కట్టడాలుగానీ వుండరాదనీ, పడమటికన్నా తూర్పున ఎక్కువ ఖాళీస్థలం వుండాలనే నియమాల్ని ఏర్పరచారు వాస్తు పరిశోధకులు.

సూర్యకాంతి ఉదయాన తూర్పున ఇంటిముంగిట కానీ, ఇంటిమీదగానీ ప్రసరించినప్పుడు దాని ప్రభావం మనపై తప్పక వుంటుంది. ఒకవేళ మన యింటికి ఈశాన్యాలలో ఎత్తయిన చెట్లుంటే ఆ చెట్లకేమో ఉపకారం జరుగుతుంది. ఎలా అంటారా? సూర్యరశ్మి ఆకులపై పడినప్పుడు అందలి పచ్చదనం (పత్రహరితం)

గాలిలోని బొగ్గుపులుసు వాయువును, వ్రేళ్ళచే పీల్చుకొనబడిన నీటిని, వినియోగించుకొని చెట్లు తమకవసరమైన పిండి పదార్థాన్ని ఉత్పత్తి చేసుకొంటాయి. దీనినే “కిరణజన్య సంయోగ క్రియ” అంటారు. కానీ మనకు మాత్రం సూర్యరశ్మి వలన కలిగే ప్రత్యక్ష శుభాలు శూన్యమే అవుతాయి. అదే మన యింటికి పడమటి వైపు చెట్లుంటే అటు కిరణజన్య సంయోగ క్రియ, ఇటు మనకు సూర్యరశ్మి వలన లభించే అనూహ్యమైన శుభాలు చేకూరుతాయి. కాబట్టి ఈ చెట్లు తీసివేయాలి

ఇంటికి ఉత్తరాన ఎక్కువ ఖాళీ స్థలం వదలాలనటంలోని ఆంతర్యమేమిటి? ఇది కూడా సూర్యగమన ఘనతను వ్యక్తం చేయడమే ! సూర్యుడు ఉత్తరంగా సంచరించే ఆరుమాసాలను ఉత్తరాయణమనీ, దక్షిణంగా సంచరించే ఆరుమాసాలను దక్షిణాయనమనీ అంటారు. డిసెంబర్ 21 నుండి జూన్ 20 వరకు ఉత్తరాయణం, జూన్ 21 నుండి డిసెంబర్ 20 వరకు దక్షిణాయనం సంభవిస్తాయి.

దక్షిణాయన కాలంలో ఉద్రేకించే పెక్కు వ్యాధులు ఉత్తరాయణ కాలంలో ఉపశమిస్తాయి. వివాహం, గృహ నిర్మాణాది శుభకార్యాలు ఉత్తరాయణ కాలంలో నిర్వహిస్తే శుభలాభాలు కలుగుతాయనీ అనుభవరీత్యా అన్నారు ఆర్యులు. దీనికంతా కారణం ఉత్తరాయణంలో సూర్యరశ్మికున్న ప్రభావమే ! అందుకేనేమో కురుక్షేత్ర మహాసంగ్రామంలో అంపశయ్యపై ఒరిగిన భీష్ముడు ఉత్తరాయణం కొరకు వేచివుండి కృష్ణుడు కోరడంతో ధర్మజునికి సకల ధర్మాలు బోధించి ఆచార్యుడై ఉత్తరాయణం ప్రవేశించడంతోనే అనంత శక్తిలో అంతర్థానమైనాడు. అదియే భీష్మ ఏకాదశి .

ఇంతటి ప్రాశస్త్యము గల ఉత్తరాయణమందలి సూర్యరశ్మిని కావలసినంత పొందేందుకు ఇంటికి ఉత్తరాన దక్షిణంకన్నా అధికంగా ఖాళీస్థలం వదలడం సకల విధాల శుభోదర్కమని అనుభవజ్ఞులే తేల్చారు. కాబట్టి ఉత్తరం కన్నా దక్షిణం ఖాళీ స్థలం ఎక్కువ అయినపుడు ఇల్లైనా, ఇండస్ట్రీ అయినా, గుడి అయినా, గుడిసె అయినా పతనావస్థకు చేరుకుంటాయన్నది వాస్తు సత్యం.