పూజారంభంలో పునాది త్రవ్వకం
గృహనిర్మాణ పూజారంభంలో ఇంటిని నిర్మించు స్థలం యొక్క ఈశాన్యంలో పునాది తీయవలెనా? లేక మొత్తం స్థలానికి ఈశాన్యంలో పునాది తీయవలెనా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తం స్థలానికి ఈశాన్యములోను లేదా ఇంటిని నిర్మించే స్థలము యొక్క ఈశాన్యంలోను పునాది తీసి వాస్తుపూజకు అంకురార్పణ చేయడం శుభం. ఆ పునాదియందే నవధాన్యాలను నిక్షేపించవచ్చు. వాస్తు పూజలో పాల్గొనేవారు తూర్పు నకభిముఖంగా పూజాకార్యక్రమాన్ని నిర్వహించడం శ్రేష్ఠం. స్థలం విదిక్కులలో ఉన్నప్పుడు ఈశాన్య ముఖంగా కూర్చొని నిర్వహించాలి. మొత్తం స్థలం యొక్క ఈశాన్యంలో పునాది తీయడం మంచిది. “శంకుస్థాపన” తప్పని సరిగా ఈశాన్యంలో మాత్రమే చేయాలని పేర్కొనడం మనకు తెలుసు. అయితే కేవలం ఈశాన్యంలో మాత్రమే “శంకుస్థాపన” ఎందుకు చేయాలనే ప్రశ్న మనకు ఉదయించవచ్చు. పోతే ప్రాచీన వాస్తు గ్రంథాలు కూడా ఈ పద్ధతినే సూచిస్తున్నాయి. కాబట్టి దీని యొక్క వివరణలోకి వెళితే ఒక సత్యం స్ఫురిస్తుంది. ఎప్పుడైతే ఈశాన్యం దిశలో త్రవ్వకం చేస్తామో అప్పుడు ఈశాన్యం బరువు తగ్గి, నైరృతి బరువు పెరుగుతుంది. ఇది శాస్త్ర సమ్మతమైన సూత్రం. ఆ విధముగా ఇటు ఈశాన్యం, అటు నైరృతి దిశల ప్రభావం అధికమై సత్ఫలితాలకు స్వాగతమిస్తుంది.


