banner 6 1

47

వాస్తు అన్న పదానికి ఈ రోజు మనము వాడుతున్న అర్థం వేరు. పూర్వం నిర్మాణ శైలి(architecture), శిల్పకళ (sculpture), నగర నిర్మాణము (town planning) లాంటి వివిధ అంశాలన్నిటినీ కలిపి వాస్తు శాస్త్రంగా భావించేవారు. పురాణాలు మరియు ఇతిహాసాలుగా పిలువబడే రామాయణ మహాభారతాలలో అష్ట దిక్పాలకుల గురించి మరియు వాస్తు శాస్త్రం గురించి ప్రస్తావన ఉంటుంది. రామాయణం నందు అయోధ్య లోని ప్రజల జీవనంతో పాటు అయోధ్య నగర నిర్మాణము గురించి వివరించబడినది. రాజ భవనాలు. మేడల గురించి అద్భుతంగా వర్ణించబడినది.రహదారులు, రహదారులకిరువైపున నాటబడిన చెట్ల గురించికూడా వివరంచబడినది. మహాభారతం నందు పాండవుల రాజధాని అయిన ఇంద్రప్రస్థ నగరం గురించి సంపూర్ణ వర్ణన ఉంటుంది.

వాస్తు శాస్త్రం గురించి పరిచయం ఉన్న అందరికి తెలిసిన మహర్షులు విశ్వకర్మ మరియు మయుడు. సకల నిర్మాణ కళలకు ఆద్య పురుషుడుగా విశ్వకర్మ మహర్షి పురాణాలలో చెప్పబడినాడు. రామాయణంలో వివరించబడిన లంకాపురి పట్టణము మరియు మహాభారతంలో చెప్పబడిన ద్వారకా నగరము అయన చేతులమీదుగానే నిర్మించబడినట్లు చెప్పబడుతుంది. ఇంద్రుని సభాభవనం ఉన్న అమరావతిని కూడా నిర్మించినది దేవశిల్పి అయిన విశ్వకర్మయే అని పురాణాలు చెబుతున్నాయి. వాస్తు శాస్త్రం మరియు ఇతర నిర్మాణ కళల గురించి ఈ లోకానికి తెలియచేసిన అష్టాదశ (18 మంది) మహర్షులలో అయన అగ్రగణ్యుడు. విశ్వకర్మ తరువాత వాస్తు కళల గురించి అంతే స్థాయిలో లోకానికి తెలియచేసిన వారు విశ్వకర్మ వంశీకుడైన మయ మాహర్షి. పురాణాల ద్వారా అష్టాదశ మహర్షులు చెప్పిన విషయాల ఆధారంగా ప్రాచీన కాలంలో వాస్తు శాస్త్రానికి సంబందించిన ఎన్నో గ్రంథాలు రచించబడినవి. వాటిలో మయమతం, వాస్తు రాజవల్లభం, సమరాంగణ సూత్రధారం, అపరాజిత పుచ్చ, వాస్తు విద్య, మనుష్యాలయ చంద్రిక, విశ్వకర్మప్రకాశిక, శిల్ప రత్నాకరం, మానసారం ముఖ్యమైనవి.

ఆధునిక వాస్తు శాస్త్రజ్ఞులు

ఆధునిక వాస్తు శాస్త్రానికి ఆద్యుడు కీ శే ముద్రగడ రామారావు గారు. గృహ నిర్మాణంలో వాస్తు శాస్త్ర పరంగా నూతన వరవడి కి అంకురార్పణ చేసిన వ్యక్తి ముద్రగడ. పరిశీలన మరియు అనుభవాల ఆధారంగా 1954వ సం||లో ఆయన తన “శ్రీ రామరాయ వాస్తు శాస్త్రము” అను గ్రంథము ద్వార ఎన్నో నూతన నియమాలను ప్రతిపాదించినాడు. పురాతన గ్రంథాల్లో చెప్పబడిన శాస్త్రానికి భిన్నమైన శాస్త్రాన్ని ఆచరించడం ఆయనతోనే మొదలైంది. దానికి ప్రజల ఆమోదం లభించడంతో ఆధునిక వాస్తు శాస్త్రం గా పిలువబడే ఒక కొత్త వాస్తు పద్దతి ఆవిష్కరించబడినది. గ్రంథాలకు బదులుగా ఫలితాలను వాస్తు శాస్త్రానికి ప్రామాణికంగా భావించిన మొదటి వ్యక్తి రామారావు గారు అని చెప్పవచ్చు. ఆపై చాలా కాలం తరువాత అనగా 1987వ సం||లో కీశే శ్రీ గౌరు తిరుపతిరెడ్డి గారిచే “వాస్తు శాస్త్ర వాస్తవాలు” అను గ్రంథము వెలువడింది. ఇది సులభమైన భాషలో రాయబడటం వల్ల ప్రజలకు బాగా చేరువైంది. దానిలో చెప్పబడిన విషయాలు క్షేత్ర స్థాయి పరీక్షలకు నిలబడటంతో అది తెలుగు నాట సంచలనం సృష్టించింది. అప్పటి వరకు గ్రాంథికభాషలోభాషలో ఉన్న వాస్తు శాస్త్రాన్ని ఈ గ్రంథము సులభమైన భాష ద్వార సామాన్యుడికి చేరువ చేసింది. ఎన్నో ముద్రణలు పొందిన ఈ గ్రంథం ఎందరికో ప్రేరణగా నిలిచి ఊరూరా వాస్తు సలహాదారులను తయారుచేసింది. వాస్తు అంటే మూఢనమ్మకం అని భావించే విద్యావంతులకు సైతం వాస్తు శాస్త్రం పై నమ్మకం కలిగించడంలో విజయం సాధించింది. ఈ గ్రంథం ఇతర భాషలలోకి అనువదించబడటంతో తెలుగు ప్రాంతంలోనే కాక ఇతర ప్రాంతాలలో కూడా ఆధునిక వాస్తు శాస్త్రం ప్రాచుర్యంలోకి వచ్చింది. సామాజిక మాధ్యమాలు లేని రోజుల్లో కూడా వాస్తు శాస్త్రానికి ఈ గ్రంథం ఎంతో ప్రాచుర్యం కలిగించింది. వాస్తును పాటించటం ఒక మత పరమైన ఆచారం అని ప్రజలలో ఉన్న భావన తొలగి వాస్తు ఒక శాస్త్రబద్ధమైన అవసరం అని ప్రజలు బావిస్తున్నారంటే అందుకు ప్రముఖంగా ముద్రగడ రామారావు గారు మరియు గౌరు తిరుపతిరెడ్డి గార్లే కారణం.

ముద్రగడ రామారావు గారు వాస్తు శాస్త్రాన్ని తన పరిశీలన ద్వార అభివృద్ధి చేస్తే తిరుపతి రెడ్డి గారు పరిశోధన మరియు ప్రయోగాల ద్వార మరింత ముందుకు తీసుకు వెళ్లారు. ఒకప్పుడు జ్యోతిష్యంలో ఒక భాగంగా ఉన్న వాస్తు శాస్త్రం నేడు ప్రత్యేకమైన శాస్త్రంగా అభివృద్ధి చెందినదంటే అది వారిరువురి వల్లే. తిరుపతి రెడ్డి గారు ఎన్నో భేటీలలో పాల్గొని వాస్తు శాస్త్రం పట్ల ప్రజలకు ఉన్న అపోహలను తొలగించి అవగాహన కల్పించుటకు కృషి చేసారు.

గారు తిరుపతి రెడ్డి గారు తన గ్రంథం ద్వార చెప్పిన ఒక విషయం ఆ గ్రంథాన్ని చదివిన వారి మెదళ్లలోకి బాగా చొచ్చుకుపోయింది. అది ఏమిటంటే గ్రంథంలో చెప్పిన విషయాలు క్షేత్రంలో పరీక్షించుకోవచ్చని. దాంతో సామాన్యులు కూడా శాస్త్ర పరంగా ఇండ్లను పరిశీలించటం మొదలు పెట్టారు. ఫలితాలు సానుకూలంగా రావడంతో ఆధునిక వాస్తు శాస్త్రం మరింత ఆదరణ పొందింది. గ్రామాలకు గ్రామాలు వాస్తు పరమైన మార్పులకు లోనైనవి.