ప్రాచీన కాలంలో ఋషులు కొన్ని వాస్తు నియమాలను గణిత శాస్త్ర పరంగా వివరించారు. ఉదాహరణకు ప్రహరీ యొక్క నైరుతి మూలను లంబంగా (90 డిగ్రీలు) ఉంచడం. అందుకే నేను కూడా గణిత శాస్త్రం ద్వారానే వాస్తు శాస్త్ర సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని భావించాను. అందుకనుగుణంగానే కొంత గణిత శాస్త్రాన్ని కూడా అధ్యయనం చేశాను. రేఖాగణితము (Geometry) ఉపయోగించి గృహాలను పరిశీలించడం మొదలుపెట్టాను. ముందుగా నమూనాలను కాగితంపై గీసి రేఖాగణిత పరంగా విశ్లేషించాను. అలా గణిత శాస్త్ర పరంగా వివరించదగు వాస్తు లక్షణాలను కనుగొన్నాను.
వాస్తు లక్షణం : వైద్యులు కొన్ని పారామితుల (parameters) ద్వారా మనిషి యొక్క ఆరోగ్య మరియు అనారోగ్య స్థాయిని వ్యక్తపరుస్తారు. ఉదాహరణకు ఆరోగ్యకరమైన మనిషికి ఉండవల్సిన చక్కర స్థాయి మరియు రక్తపోటు ఎంత అన్నది వైద్యశాస్త్రం నిర్దేశిస్తుంది. అలాగే వాస్తు శాస్త్రం కూడా శాస్త్ర పరంగా ఇంటికి ఉండవలసిన మరియు ఉండకూడని పరామితులేమిటో నిర్దేశిస్తుంది. ఆ పరామితులనే మనం వాస్తు లక్షణాలు అనవచ్చు.
సంఖ్యల ద్వారా వ్యక్తీకరించబడే కొలతలు ఏ శాస్త్రానికైనా ఆధారం. వైద్యులు బి పి మరియు రక్తంలో చక్కర స్థాయిని సంఖ్యల ద్వారా వ్యక్తపరుస్తారు. భౌతిక శాస్త్రజ్ఞులు గురుత్వాకర్షణ శక్తిని సంఖ్యల ద్వారా వ్యక్త పరుస్తారు. గణిత శాస్త్రానికి అంకెలు మరియు సంఖ్యలే ఆధారం అని చెప్పవలసిన పనిలేదు. బాగా పరిశోధించిన పిమ్మట వాస్తు లక్షణాలను కూడా మనం సంఖ్యల ద్వారానే సాంకేతికంగా వ్యక్తపరుస్తామని నాకు అర్థం అయ్యింది.ఉదాహరణకు ఇంటియొక్క నాలుగు మూలలు మరియు ప్రహరీ యొక్క నైరుతి మూల లంబంగా (perpendicular) ఉండాలని ప్రాచీన కాలం లో ఋషులు తెలియచేసారు. లంబంగా ఉండడటం అన్నది గణితశాస్త్రపరంగా వ్యక్తపరచ గలిగిన లక్షణం. అలాగే ఋషులు ప్రహరీకి ఈశాన్యాన్ని ఎలా పెంచాలో తెలియచేసారు. ఈశాన్యాన్ని పెంచడం అంటే ఆగ్నేయం మూలలో లేదా వాయవ్యం మూలలో కోణాన్ని అధిక కోణంగా (obtuse angle) ఉంచడం. అంటే ఈశాన్యం పెరిగిఉండడటం అనే వాస్తు లక్షణాన్ని కూడా గణిత శాస్త్రపరంగా వ్యక్తీకరించవచ్చు. అంతే కాదు వాస్తు శాస్త్రానికి మూలమైన దిక్కులను మనం డిగ్రీలలో వ్యక్తపరుస్తాము.
పైన చెప్పబడిన వాస్తు లక్షణాలను ప్రత్యక్షంగా గణితశాస్త్రపరంగా వ్యక్తీకరిస్తున్నప్పటికీ శాస్త్రంలో ఉన్న ఇతర వాస్తు లక్షణాలను కూడా పరోక్షంగా గణితశాస్త్రపరంగానే వ్యక్తీకరిస్తాము. ఉదాహరణకు సెప్టిక్ ట్యాంక్ ఆగ్నేయమూల నుంచి నియమిత దూరంలో తూర్పుదిక్కులో నిర్మించాలని చెబుతాము. సులభ ఆచరణ రీత్యా దూరం ద్వారా(in terms of distance) సెప్టిక్ ట్యాంక్ స్థానాన్ని వ్యక్తపరుస్తున్నప్పటికీ దానిని మనం కోణం (angle) ద్వారా కూడా వ్యక్తపరచవచ్చు. ద్వారాల యొక్క స్థానాలనైనా సరే అలాగే వ్యక్తపరుస్తాము.
స్థలం యొక్క ఎత్తు పల్లాలు ఎలావుండాలో వాస్తు శాస్త్రం నిర్దేశిస్తుంది. అయితే ఎత్తు పల్లాలను సాపేక్షంగా(comparative) వ్యక్తీకరిస్తాము. ఇంటికి నాలుగు వైపులా ఉండవలసిన ఖాళీ స్థలాల పరిమాణాన్ని కూడా సాపేక్షంగానే వ్యక్తీకరిస్తాము. గణిత శాస్త్ర పరంగా నిర్వచించబడలేని వాస్తు లక్షణాలు ఉండకపోవచ్చు.
సరళ వాస్తు లక్షణము : పైన చెప్పబడిన వాస్తు లక్షణాలలో ‘నైరుతి లంబంగా ఉండుట ‘ అన్నది ఒక సరళ వాస్తు నియమము. ఎందుకంటే అది ఒకేఒక వాస్తు లక్షణాన్ని కలిగివుంది. స్థలం ఎన్ని డిగ్రీలు తిరిగివుంది అన్నది కూడ ఒక సరళ వాస్తు లక్షణం. విడిగా చూసినపుడు సెప్టిక్ ట్యాంక్ యొక్క స్థానంను కూడా ఒక సరళవాస్తులక్షణంగానే చెప్పవచు నిర్దేశిత మరియు నిర్దేశక వాస్తులక్షణములు: ‘ద్వారాల యొక్క స్థానం’ అన్నది ఒక వాస్తులక్షణం. ‘స్థలం ఎన్ని డిగ్రీలు తిరిగి ఉన్నది’ అన్నది కూడా ఒక వాస్తు లక్షణం అని మనకు తెలుసు. ‘ద్వారం ఉంచదగిన స్థానం’ స్థలం- ఏ దిక్కుకు తిరిగియున్నది అన్న విషయం పై ఆధారపడి ఉంటుంది. అంటే ఒక వాస్తు లక్షణం మరో వాస్తు లక్షణాన్ని నిర్దేశిస్తుంది. ఇక్కడ ‘ద్వారాల యొక్క స్థానం’ నిర్దేశిత (నిర్దేశించబడు) వాస్తులక్షణం అయితే ‘స్థలం ఎన్ని డిగ్రీలు తిరిగి ఉన్నది’ అన్నది నిర్దేశక (నిర్దేశించు) వాస్తు లక్షణం. ‘స్థలం ఎన్ని డిగ్రీలు తిరిగి ఉన్నది’ అన్న వాస్తు లక్షణం సాధారణంగా ఇతర అన్ని వాస్తులక్షణాలను నిర్దేశిస్తుంది.
స్వతంత్ర వాస్తులక్షణం: ఇంటి యొక్క నాలుగు మూలలు లంబంగా ఉండుట అన్న వాస్తు లక్షణం మిగతా వాస్తులక్షణాలతో సంబంధం లేకుండా ఎల్లపుడు పాటించవలసిన నియమం. స్థలం ఎన్ని డిగ్రీలు తిరిగినా ఇంటి యొక్క నాలుగు మూలలను లంబంగానే ఉంచుతాము. కాబట్టి అది స్వతంత్ర వాస్తులక్షణం.
మిశ్రమ వాస్తు లక్షణము: ఒకటికంటే ఎక్కువ వాస్తు లక్షణాలు కలిసి ఏర్పడిన లక్షణాన్ని మిశ్రమ వాస్తులక్షణం
అంటాము. ఉదాహరణకు ‘స్థలం ఎన్ని డిగ్రీలు తిరిగి ఉన్నది’ ఒక వాస్తు లక్షణం అని మనకు తెలుసు అయితే ‘ముఖ భాగంలో ఉన్న గదుల సంఖ్య ‘మరోవాస్తు లక్షణము. ఆ రెండింటిని కలిపి మిశ్రమ వాస్తు లక్షణం అంటాము. ఒక మిశ్రమ వాస్తు లక్షణం ఇతర వాస్తు లక్షణాలకు నిర్దేశక వాస్తులక్షణం కూడా కావచ్చు. ఉదాహరణకు ‘ముఖద్వారం యొక్క స్థానం’ అన్నది మరో వాస్తులక్షణం అనుకుందాము. ‘స్థలం ఎన్ని డిగ్రీలు తిరిగి ఉన్నది’ మరియు ‘ముఖ భాగంలో ఉన్న గదుల సంఖ్య ‘ను పరిగణించి ‘ముఖద్వారం యొక్క స్థానాన్ని ‘నిర్ణయిస్తాము.
వాస్తులక్షణం అన్నది గణితశాస్త్ర పరంగా నిర్వచించబడగలిగినదై ఉండి మంచి లేదా చెడు ప్రభావాన్ని కలిగి ఉండాలి లేదా ఇతర వాస్తులక్షణాలను నిర్దేశించాలి. ఉదాహరణకు బ్రహ్మ స్థానాన్ని మనము గణితశాస్త్ర పరంగా నిర్వచించవచ్చు కానీ అది మంచి ప్రభావం కానీ చెడు ప్రభావం కానీ కలిగించకపోతే దానిని వాస్తు లక్షణం గా చెప్పలేము.
మీరు గణితశాస్త్ర పరంగా వ్యక్తీకరించదగు ఒక లక్షణాన్ని కనుగొనండి. దాని యొక్క శుభాశుభ ఫలితాలను తెలుసుకోండి. ఆ లక్షణం వల్ల శుభ లేదా అశుభ ఫలితం ఉంటే మీరు ఒక క్రొత్త వాస్తు లక్షణాన్ని కనుగొన్నట్టే. ఇలా పరిశోధిస్తే ఇంకా తెలియని దోషాలను కనుగొనవచ్చు
నేడు ఫలితాధారమైనదిగా (result oriented) అని బావించి ఆధునిక వాస్తు శాస్త్ర నియమాల ప్రకారం ఇండ్లు నిర్మించుకొని ఎందరో ప్రజలు ఆనందంగా జీవిస్తున్నారు. అయితే కొందరికి సానుకూల ఫలితాలు రాక సమస్యలను ఎదుర్కొంటున్నారు. కారణం అర్థం కాక సలహాదారులు తలలు పట్టుకుంటున్నారు. సమస్యల పరిష్కారం కోసం ఆధునిక వాస్తు శాస్త్రాన్ని ఆశ్రయించిన నేను కూడా పరిష్కారం లభించక ఎన్నో ఇబ్బందులు పడ్డాను. చాల మంది సలహాదారులను సంప్రదించినా ఫలితం కలుగలేదు. కొంత కాలం తరువాత ఇంకా ఏవో తెలియని దోషాలు ఉండి ఉంటాయని గ్రహించాను. అవసరం ఆవిష్కరణకు మాతృక అన్నది ఆంగ్ల సామెత. ఇక పరిశోధించడం మొదలు పెట్టాను.
స్థలం దిక్కుకులేనపుడు సమస్యలు వచ్చే అవకాశం అధికమని అందరు సలహాదారులు చెబుతుంటారు. అంటే స్థలం దిక్కుకు లేనపుడు దిక్కులను అర్థం చేసుకోవడంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయని కదా! స్థలం దీర్ఘచతురస్రాకారంగా ఉన్నపుడు కూడా దిక్కులను అర్ధం చేసుకోవడం కష్టం అవుతుంది. దిక్కులు శాస్త్రానికి ఆధారం కావున సాంకేతికంగా ఎటువంటి లోపాలు లేని దిక్సాధనా విధానాన్ని అభివృద్ధి చేయాలని తలచాను. రేఖాగణితం ఉపయోగించి సుదీర్ఘ ప్రయత్నం తరువాత నాలుగు బిందువుల పద్ధతిని అభివృద్ధి చేశాను. ఆ తరువాత ఆధునిక వాస్తు నియమాల ప్రకారం నిర్మించబడి నష్టాలను కలిగిస్తున్న గృహాలను క్షేత్ర స్థాయి పరిశోధనకు ఎంచుకున్నాను. నాలుగు బిందువుల పద్ధతి ద్వారా ఆ గృహాలకు దిక్సాధన చేసి ద్వారాలు ఉన్న దిశలను గుర్తించాను. ద్వారాల యొక్క స్థానాలే దోషాలు కలిగిస్తున్నాయని తెలుసుకున్నాను. స్థలం ఆగ్నేయ ప్రాచిలో ఉన్నపుడు పశ్చిమ వాయవ్యం మూలలో ద్వారం లేదా గేటు ఉంటే అవి దోషాలు కలిగిస్తున్నాయని అర్థం అయ్యింది. స్థలం తిరిగివుండటంతో పశ్చిమ వాయవ్యం లా కనిపించేచోట ఉత్తరవాయవ్యం ఉంది. అంటే పశ్చిమ వాయవ్య ద్వారంగా కనబడుతున్న ఉత్తరవాయవు ద్వారం దోషాన్ని కలిగించింది. సమస్యలకు కారణమైన నా ఇంటిలో కూడా ద్వారం మరి గేట్లు దోషాలను కలిగిస్తున్నాయని అదే పద్దతి ద్వారా తెలుసుకున్నాను. నా ఇల్లు 15 డిగ్రీలు తిరిగి ఈశాన్య ప్రాచిలో ఉన్నది. వంట గది నుంచి బయటకి వెళ్ళటానికి వీలుగా దక్షిణ ఆగ్నేయంలో ద్వారం ఉంది. స్థలం తిరిగివుండటం వల్ల అది తూర్పు ఆగ్నేయ ద్వారంగా మారింది. మరింత విస్తృతంగా మరియు లోతుగా అధ్యయనము చెయ్యడం ద్వారా ద్వారాలు ఉండవల్సిన స్థానాల గురించి పూర్తి అవగాహన ఏర్పడినది. ముఖ్యంగా స్థలం దిక్కుకు లేనపుడు ద్వార నిర్ణయం ఎలా చేయాలన్నది నేను దృష్టి పెట్టిన అంశం. ద్వార నిర్ణయంతో గదుల అమరికకు సంబంధం ఉంటుందని ఆధునిక వాస్తు శాస్త్రజ్ఞులు పరోక్షంగా తెలియజేశారు. అయితే స్థలం దిక్కకు లేకుండా తిరిగిఉన్నపుడు గదుల అమరికను పరిగణించి ద్వార నిర్ణయం చేయడాన్ని నేను అభివృద్ధి చేశాను. ‘ద్వార నిర్ణయం’ అను అధ్యాయం నందు ఈ విషయాలను గురించి వివరించాను.
నడకల ఏర్పాటు గురించి ఆధునిక వాస్తు శాస్త్రజ్ఞులు తమ గ్రంథాల ద్వారా వివరించారు. స్థలం దిక్కుకు లేనపుడు నడకలు ఎలా ఏర్పాటు చేయాలో పరిశోధించి ఆ విషయాలను ఈ గ్రంథంలో పొందుపరిచాను.
దిక్కుల్లో ఉన్న స్థలం ఒక ప్రత్యేక కోణం (22.5 డిగ్రీలు) వద్ద విదిక్కుల స్థలంగా మారుతుందని గ్రహించి దానిని ఆ కోణానికి సంధి కోణం అను పేరును ప్రతిపాదించాను. స్థలం అటు దిక్కుల్లోను ఇటు విదిక్కులోను లేకుండా సంధి కోణానికి దగ్గరగా ఉన్నపుడు ద్వార నిర్ణయంలో మరియు గదుల అమరికలో ఎటువంటి సమస్యలు ఎదురౌతాయో కనుగొన్నాను. సంధికోణ సమస్య అంటే ఏమిటో దానిని ఎలా అధిగమించాలో ఈ పుస్తకంలో వివరించాను.
వాస్తు శాస్త్రంతో పరిచయం ఏర్పడిన తొలినాళ్ళ నుంచి నాలో ఒక తీరని అనుమానం ఉండేది. అది ఏమిటంటే ఇంటి చుట్టూ ఖాళీ ప్రదేశాలు ఎలా విస్తరించి ఉంటాయని. దిక్సాధనకు ఎటువంటి సాంకేతిక లోపాలు లేని నాలుగు బిందువుల పద్దతిని అభివృద్ధి చేసాక నా దృష్టి ఖాళీ ప్రదేశాల మీదకు మళ్లింది. ఎంతో పరిశోధన తరువాత సూచక రేఖల పద్దతిని అభివృద్ధి చేశాను. సూచక రేఖల పద్దతికి నాలుగు బిందువుల పద్దతి జోడించి దానిని మరింత మెరుగుపరిచాను. కొత్తగా అభివృద్ధి చేసిన ఈ పద్దతిని ఉపయోగించి ఇంటి చుట్టూ నాలుగు వైపులా ఉండవలసిన ఖాళీ ప్రదేశాలను అధ్యయనం చేశాను. కాగితంపై కొన్ని నమూనాలను అధ్యయనం చేసిన తరువాత ఖాళీ స్థలాలు ఎలా విస్తరిస్తాయో తెలుసుకున్నాను. క్షేత్ర స్థాయి పరిశోధనకు మళ్ళీ ఆధునిక వాస్తు నియమాల ప్రకారం నిర్మించబడి నష్టాలను కలిగిస్తున్న గృహాలను ఎన్నుకున్నాను. ఆధునిక వాస్తు నియమాల ప్రకారం నిర్మించిన గృహం పూర్తిగా నష్టదాయకంగా ఉందంటే దానిలో ఖాళీ ప్రదేశాలకు సంబంధించిన లోపలే ఎక్కువగా ఉంటున్నాయి. ఇదే నేను గమనించింది. పైగా ఖాళీ ప్రదేశాలకు సంబంధించిన దోషాలు ద్వారాల యొక్క స్థానాలకు సంబంధించిన దోషాలకంటే తీవ్రమైన నష్టాలను కలిగిస్తున్నాయి. అంతే కాక నియమాలకనుగుణంగా ఖాళీ ప్రదేశాలను కలిగి ఉన్న గృహాలు ద్వార స్థానాలలో కొన్ని లోపాలు ఉన్నప్పటికీ కొంత ఆర్థిక ప్రగతిని సాధిస్తున్నాయి. ఖాళీ ప్రదేశాలకు సంబంధించిన పరిశోధనలో తెలుసుకున్న విషయాలను ‘ప్రదేశ విన్యాసం ‘ అను అధ్యాయం నందు వివరించాను.
స్థలం దిక్కుకులేనపుడు గొయ్యి ఉండవలసిన స్థానాలు ఎలా మారుతాయో కొంత వివరంగా తెలుసుకున్నాను. అదే విధంగా స్థలం దిక్కుకులేనపుడు వీదిచూపులు/ పోట్లు ఎలాంటి ఫలితాలు ఇస్తాయో కూడా కొంత వరకు పరిశోధించాను. ఆ ఫలితాలన్నీ ఈ గ్రంథంలో వివరించాను.
స్థలం దిక్కుకు లేనపుడు మరియు విదిక్కులలో ఉన్నపుడు వరండాలు మరియు బాల్కనీలు ఎలా ఏర్పాటుచేయాలో కూడా పరిశోధించి ఈ గ్రంథంలో వివరించాను.

