banner 6 1

49

ఈ రోజు ఎంతో మంది వాస్తు సలహాదారులుగా సమాజంలో చలామణి అవుతున్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా ఎంతో మంది వాస్తు పట్ల అవగాహన కలిగిస్తున్నామని చెప్పుకుంటూ వారికి తోచింది చెబుతున్నారు. ఒక్కొక్కరు ఒక్కో విధంగా చెబుతుండడంతో ప్రజలలో అయోమయం నెలకొంది. వాస్తు సలహాదారునికి ఉండవలసిన ప్రధాన లక్షణం శాస్త్రం పై పూర్తి స్థాయి విశ్వాసం. వాస్తు శాస్త్రంపై సంపూర్ణమైన విశ్వాసం లేని వ్యక్తి నిజమైన సలహాదారుడు కాలేడు. నిజమైన సలహాదారునికి గృహస్తుల సమస్యలకు వాస్తు శాస్త్రం ద్వారా పూర్తి స్థాయి పరిష్కారం అందించగలననే ధైర్యం ఉంటుంది. వాస్తు సలహాదారులుగా పనిచేస్తూ సమస్యల పరిష్కారానికి యజ్ఞ యాగాదులు మరియు శాంతులు నిర్వహిస్తున్నారంటే వారికి శాస్త్రం పై పూర్తి అవగాహన లేదని భావించాలి. వాస్తు దోషాలను సవరించకుండా యజ్ఞ యాగాదులు మరియు పూజలతో సమస్యలను పరిష్కరించుకోలేమని తెలుసుకొండి. వాస్తు శాస్త్ర పరిధిలో మీ సమస్యలకు పరిష్కారాన్ని ఇచ్చే పూర్తిస్థాయి (full time) సలహాదారుని ఎన్నుకోండి. యజ్ఞ యాగాదులు తప్పుకాకపోయిన వాటిని నిర్వహించవలసినవారు వాస్తు సలహాదారులు కాదని తెలుసుకొండి.

సామాజిక మాధ్యమాలలో కొందరు వాస్తు నిపుణులుగా చలామణి అవుతూ గృహానికి ఏ దిశలో ఏ రంగు వేయాలో చెబుతున్నారు. మరికొందరు టివి గడియారం, అద్దం లాంటి వస్తువులు ఎక్కడ పెట్టుకుంటే ఏమి లాభం కలుగుతుందో చెబుతూ అదే వాస్తు అని నమ్మబలుకుతున్నారు. ఏ రంగు నీళ్లు ఏ మూలలో నిల్వ చేయాలో చెబుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. రంగు రాళ్లు మరియు రంగు నీళ్లతో సమస్య పరిష్కారమైతే అసలు వాస్తు శాస్త్రం యొక్క అవసరం ఏమిటని ప్రశ్నించండి. నిర్మాణ పరమైన మార్పులు చేయకుండా వాస్తు పూజలు చేయడం ద్వారా దోషాలను తొలగించలేమని తెలుసుకోండి.

కొందరు పండితులు వాస్తు దోషాలకు పరిష్కారం (remedy)గా రంగు పట్టీ (colour tape)లను అంటగడుతున్నారు. లోహపు కడ్డీలు / బద్దలను గోడలో ఏర్పాటుచేసి దోషాలు మాయమౌతాయని మోసం చేస్తున్నారు. కొందరు ప్రతీకలు(symbols) పేరుతో ఖరీదైన విగ్రహాలను అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. పైన చెప్పిన పరిష్కారాలు ఏవీ కూడా పురాతణ గ్రంథాలలో కూడా ఎక్కడా లేవు. భక్తిని మతాన్ని జోడించటం వల్ల ప్రజలు వాటిని వాస్తు శాస్త్రంలో భాగంగా భావించి మోసపోతున్నారు. వాస్తు శాస్త్రం పేరుతో శాస్త్రానికి సంబంధం లేని పరిష్కారాలను సూచించి మోసం చేసేవారు ధార్మికమైన వేషధారణ కలిగివుండటం వల్ల ప్రజలు వారిని సులభంగా నమ్ముతున్నారు.

వాస్తు దోషం ఏదైనా సరే దానిని నిర్మాణపరమైన మార్పులు చేయకుండా తొలగించలేమని ఆధునిక వాస్తు శాస్త్రం చెబుతుంది. ఉదాహరణకు ఒక ద్వారం ఉండకూడని చోట ఉంటే దానిని తొలగించి సరైన స్థానంలో ఏర్పటుచేయడం ఒక్కటే సమస్య కు పరిష్కారం.

మనిషి తన సమస్యల పరిష్కారానికి సులభమైన మార్గాన్ని ఎంచుకుంటాడు. అయితే అన్ని సమస్యలకు సులభమైన పరిష్కారాలు ఉండవు కదా ? మనిషి జబ్బు పడినప్పుడు వైద్యుని సహాయం తీసుకుంటాము. కొన్ని సార్లు మందులతోనే రోగం నయమవుతుంది. కొన్ని సార్లు శస్త్ర చికిత్స నిర్వహించవలసి రావచ్చు. శస్త్ర చికిత్స చేయించుకోవాలంటే ఎంతో డబ్బు ఖర్చు అవుతుంది. నొప్పిని భరించాలి. గాయం మానడానికి సమయం తీసుకుంటుంది. రోగి కుటుంబ సభ్యులు కూడా పనులు మానుకొని సేవలు చేయాలి. ఇన్ని శ్రమలు ఉన్నప్పటికీ శాస్త్ర చికిత్సకు వెనుకాడం కదా ? సులభమైన మార్గం కోసం వెదకి చికిత్సను నిరాకరిస్తే రోగం ముదిరి మరింత ప్రమాదకరమౌతుంది కదా ? కానీ చికిత్స పూర్తయి రోగి ఆరోగ్య వంతుడైతే కుటుంబమంతా ఎంతో సంతోషిస్తుంది కదా ? వాస్తు శాస్త్రం విషయంలో నైనా అంతే, జీవితంలో సమస్యలు ఎదురై వాటికి కారణం వాస్తు దోషాలు అని భావించి వాస్తు నిపుణున్ని సంప్రదించాలంటే అతనికి రుసుము చెల్లించాలి. నిపుణుడు సూచించిన మార్పులు చేయడానికి సిమెంట్,ఇసుక, ఇటుకలు లాంటి సామాగ్రిని సమకూర్చుకోవాలి. తాపీ మేస్త్రి మరియు కూలీలను నియమించుకోవాలి. దాని కంతటికీ చాలా ఖర్చవుతుంది. మొత్తం ప్రక్రియకు సమయం వెచ్చించాలి. దుమ్ము, ధూళి వల్ల అసౌకర్యం కలుగుతుంది. వాటికీ తోడుగా పొరుగువారి వ్యాఖ్యలు మరియు బంధువుల ఉచిత సలహాలు భరించాలి. అయితే ఇంటిలో సవరణలు చేసిన కొన్ని నెలలలోనే మీరు మార్పును స్పష్టంగా పసిగట్టవచ్చు.

బీరువా పలానా స్థానంలో పెడితే ధనం ప్రవాహంలా వస్తుందని, అద్దం పలానా దిక్కుకు అమర్చితే ఆర్థిక సమస్యలు తీరుతాయని ఎవరైనా ఉచితంగా చెబితే వాటిని నమ్మకండి. ఇంటిని సమగ్రంగా పరిశీలించి ఇంటిలో ఉన్న దోషాలన్నిటిని సమగ్రంగా తొలగించినప్పుడే సమస్యలు పరిష్కారం అవుతాయని తెలుసుకొండి. వస్తువుల స్థానాలు మార్చడం వల్ల ఏమి ఒరగదని మరియు సమయం వృధా అని గ్రహించండి. ప్రమాద కరమైన జబ్బులు వచ్చినప్పుడు వంటింటి చిట్కాలు పాటిస్తారా లేక వైద్య నిపుణుడి దగ్గరకు వెళ్తారా ? ఇంటిలో వాస్తు దోషాలు ఉన్నపుడు వాస్తు నిపుణుడిని సంప్రదించి ఎంత శ్రమనైనా అనుభవించి ఇంటిలో మార్పులు చేయండి. వాస్తు శాస్త్రంలో చిట్కాలు(vastu tips) అంటూ ఏమీ లేవు కాబట్టి చిట్కారాయుళ్లకు దూరంగా ఉండండి.

శస్త్ర చికిత్స చేసే వైద్యునికి నైపుణ్యంతో పాటు ధైర్యం కూడా ఉండాలి. వాస్తు సలహాదారుడు తన నైపుణ్యంతో ఇంటిలోని దోషాలను కనుగొని వాటి గురించి యజమానికి ధైర్యంగా వివరించాలి. అలా వివరించడం సలహాదారుని నైతిక బాధ్యత. సలహాదారుడు అందించిన సూచనలు ఆపై పాటించడం పాటించకపోవడం గృహ యజమాని ఇష్టం.

సమస్యలు పరిష్కారానికి కొందరు మంత్రించిన తాయత్తులు, యంత్రాలు ఇచ్చి అధిక మొత్తంలో డబ్బు వసూలు చేస్తున్నారు. సమస్య పరిష్కారం కాకపోతే అప్పుడు ఇంటిలో వాస్తు లోపాలు ఉన్నాయని మార్పులు చేయాలని చెబుతున్నారు. అలాంటి మోసగాళ్ల వల్ల ప్రజలు ఎన్నో కష్ట నష్టాలకు గురౌతున్నారు. పలానా మంత్రం పలానా సమయంలో ఇన్ని సార్లు చదవండి మీ సమస్యలు అన్ని పరిష్కారం అవుతాయని కొందరు వాస్తు పండితులే చెబుతుంటారు. ఒక సమయంలో వాస్తు పండితులు గాను మరో సమయంలో మంత్రగాళ్ళు గాను అవతారంఎత్తుతారనమాట. మంత్రాలతో సమస్యలు పరిష్కారం అయితే ఇక వాస్తు శాస్త్రం తో పని ఏముంది. నేను ‘5 ని లలో వాస్తు’ అని ఒక వీడియో తయారు చేస్తే కొన్ని నెలల్లోనే సుమారు రెండు లక్షల మంది వీక్షించారు. ‘బీరువా పలానా చోట పెట్టండి కోటీశ్వరులు కండి’ అని ఒక వీడియో విడుదల చేస్తే ఇంకా ఎక్కువ మంది వీక్షించేవారు. కానీ వాస్ప శాస్త్రాన్ని సమగ్రంగా వివరిస్తూ చేసిన వీడియోలను ఎక్కువమంది చూడలేదు. ప్రజలు సులభమైన మరియు సత్వరమైన పరిష్కారాలను ఎన్నుకుంటారనడానికి ఇదే నిదర్శనం. ప్రజల యొక్క ఇలాంటి మనస్తత్వాన్ని మోసగాళ్లు తమకు అనుకూలంగా మలచుకుంటున్నారు.

1. అందరు పాటించేది ఆధునిక వాస్తు శాస్త్రమే

వాస్తు శాస్త్రం సాంకేతిక విషయాలతో ముడిపడి ఉంది. సాంకేతిక విషయాలను అర్ధం చేసుకోగలిగే శక్తి ఉంటేనే ఎవరైనా వాస్తు నిపుణుడు కాగలరు. దానితోపాటు క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి శాస్త్రనియమాలను బేరీజు వేయగల శక్తి ఉండాలి. ఆ రెండు లేని వారు కొన్ని పురాతన గ్రంథాలను చదివి వాటిలో చెప్పబడిన నియమాల యొక్క నిజానిజాలను మరియు సాధ్యాసాధ్యాలను పరిశీలించకుండా అమలు చేయడానికి ప్రయత్నించి అబాసు పాలవుతున్నారు. నేను కూడా తెలుగులోకి అనువదింపబడిన కొన్ని పురాతన గ్రంథాలను అధ్యయనం చేశాను. వాటిలో క్షేత్రస్థాయిలో ఋజువు చేయబడిన విషయాలతో పాటు పరిశీలనకు నిలబడని మరియు ఆచరణ సాధ్యం కానీ ఎన్నో విషయాలు ఉన్నాయి. పరిశీలనకు నిలబడని మరియు ఆచరణ సాధ్యం కాని విషయాలను పక్కనబెట్టి ఋజువు చేయబడిన విషయాలకు పరిశోధన ద్వారా తాము కనుగొన్న విషయాలను జోడించి ఆధునిక వాస్తు శాస్త్రాన్ని రూపొందించారు.

కీ.శే.లు శ్రీ గౌరు తిరుపతి రెడ్డి గారు 1987 లో రచించిన ‘వాస్తు శాస్త్ర వాస్తవాలు’ అను గ్రంథం నేటి వరకు ఆధునిక వాస్తు శాస్త్రానికి ప్రామాణికంగా ఉంది. సామాన్యులు కూడా రెడ్డి గారు బ్రతికి ఉన్నంత వరకు వాస్తు శాస్త్రానికి దానినే ప్రామాణికంగా భావించారు. అయితే ఈ మధ్య కాలంలో కొందరు పురాతన వాస్తు పండితులం అని చెప్పుకొనేవారు కొందరు ఆధునిక వాస్తు శాస్త్ర ప్రామాణికతను ప్రశ్నిస్తున్నారు. పురాతణ గ్రంథాలలో చెప్పబడిన కొన్ని నియమాలను వదలి వేశారని వారు ఆరోపిస్తున్నారు. నేను పురాతణ గ్రంథాలను పరిశీలించినపుడు నాకు తెలిసినది ఏమిటంటే పురాతన వాస్తు సలహాదారులు కూడా వారు ప్రామాణికంగా భావించే గ్రంథాలను అనుసరించుటలేదని. ఉదాహరణకు ఆయాది గణితాన్ని పురాతణ వాస్తు పండితులు అందరు పాటిస్తున్నారు కానీ ప్రతి బాహ్య ద్వారం ముందు వరండా ఉండితీరాలన్న నియమాన్ని ఎవరు కూడ పాటించటం లేదు. వరండా ఏర్పాటుకు సంబందించిన నియమం గురించి నేను ప్రశ్నించేసరికి ఆచరణ సాధ్యం కాదని తప్పించుకున్నారు. ఆధునిక వాస్తు శాస్త్రజ్ఞులు వరండా ఏర్పాటు యొక్క సాధ్యాసాధ్యాలను పరిశీలించి వరండా వల్ల కలిగే లాభనష్టాలను పరిశోధించి ఎన్నో క్రొత్త నియమాలను శాస్త్రంలో పొందుపరిచారు.ఇలా ఎన్నో క్రొత్త విషయాలను కనుగొని శాస్త్రాన్ని అభివృద్ధి చేశారు ఆధునిక వాస్తు శాస్త్రజ్ఞులు, ఆధునిక వాస్తు సలహాదారులు పాటించే నియమాలు ఏ గ్రంథంలో ఉన్నాయని వాస్తు విపణి లోకి క్రొత్తగా ప్రవేశించిన కొందరు ప్రశ్నిస్తూ గందరగోళం సృష్టిస్తున్నారు. అలా ప్రశ్నిచే వారు సైతం పురాతణ గ్రంథాలలో ఉన్న ఎన్నో నియమాలను ఆచరణ సాధ్యం కాదని ప్రక్కన పెడుతున్నారు.

పురాతణ గ్రంథాలలో లిఫ్ట్, ఓవర్ హెడ్ ట్యాంక్, సెప్టిక్ ట్యాంక్ ల గురించి చెప్పబడి ఉండే అవకాశం లేదు. మరి పూరాతణ వాస్తు పండితులు పలానా చోట సెప్టిక్ ట్యాంక్ పలానా చోట ఓవర్ హెడ్ ట్యాంక్ ఉండాలని ఎలాసూచించగలుగుతున్నారు ? ఆధునిక వాస్తు శాస్త్రజ్ఞులు సూచించిన స్థానాలనే కదా వారు కూడా సూచించేది ? పురాతన గ్రంథాల ప్రకారం పడమర మరియు దక్షిణ భాగంలో ఎక్కువ ఖాళీ వదలి ఈశాన్య భాగంలో ఇంటిని నిర్మించవచ్చు. కానీ ఏ పండితుడు కూడా అలా నిర్మించడు. కారణం వారికి తెలుసు అలా నిర్మిస్తే ఎలాంటి నష్టం జరుగుతుందో. పడమరదిశ జలాధిపతి అయిన వరుణుడి స్థానం కనుక అక్కడ బావి (well)ని త్రవ్వించవచ్చని కూడా కొన్ని పురాతన గ్రంథాలలో ఉంది. కానీ అలా చేయగలరా? ఆధునిక వాస్తు శాస్త్రం ప్రజామోదం పొందినదంటే కారణం దాని వల్ల వచ్చిన ఫలితాలు. ఎంతోమంది ఇతర మతాల వారు కూడా తమ గృహాలలో ఖర్చుకు వెనుకాడకుండా వాస్తుకు అనుగుణంగా మార్పులు చేస్తున్నారంటే దానికి ప్రజలలో ఉన్న ఆదరణను అర్థం చేసుకోవచ్చు. ఆధునిక వాస్తు శాస్త్రం అందరి సమస్యలను పరిష్కరించి ఉండక పోవచ్చు. కానీ శాస్త్రంలో పరిశోధన కొనసాగితే అందరి సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది.

శాస్త్రజ్ఞులు తాము చేసిన ప్రయోగాలు మరియు పరిశోధనల ద్వారా నిరూపితమైన విషయాలను గ్రంథాలలో పొందుపరుస్తారు. అప్పుడు ఆ గ్రంథాలు శాస్త్రానికి ప్రామాణికాలుగా మారుతాయి. భౌతిక (Physics) మరియు రసాయన శాస్త్రా (Chemistry)లలో ఒక సారి ఏర్పరిచిన ప్రమాణాలను ప్రశ్నించడం లేదా మార్చడం అరుదు. పూరాతణ వాస్తు పండితులు గ్రంథాలే ప్రామాణికం అంటారు. మరి గ్రంథాలకు ఏమిటి ప్రామాణికం అంటే సమాధానం చెప్పరు. గ్రంథాలలో చెప్పబడిన విషయాలను పరీక్షించినపుడు అవి సత్యాలని తేలితే ఆ సత్యాలను ప్రామాణికంగా భావిస్తాము. పూరాతణ గ్రంథాలలో ఉత్తర ఈశాన్యంలో ఇంటి ఎదురుగా వచ్చి, తగిలే వీధి (ఉత్తర ఈశాన్యం వీధి చూపు) నష్టాన్ని కలిగిస్తుందని ఉంది. మీరు క్షేత్ర స్థాయిలో పరిశీలించినపుడు అది ఎటువంటి నష్టాన్ని కలిగించదు అని తెలుసుకోవచ్చు. పైగా ఉత్తర ఈశాన్యం వీధి చూపు ఉన్న ఇంటి వారు ధనవంతులుగా ఉంటారు. ఆధునిక వాస్తు శాస్త్రజ్ఞులు తమ పరిశీలన ద్వారా వీధిపోట్లు (చెడు కలిగించేవి) మరియు వీదిచూపుల (మంచి కలిగించేవి) మధ్య తేడా ను తెలుసుకున్నారు. పురాతణ వాస్తు పండితులందరికి ఈ విషయం తెలుసు కానీ అమాయకత్వం నటిస్తుంటారు.

వైద్య శాస్త్రం లాంటి శాస్త్రాలలో కాలానుగుణంగా పరిశోధనలు చేసి ముందు ఏర్పరచిన ప్రమాణాలను సవరిస్తుంటారు. అలాగే వాస్తు శాస్త్ర నియమాలను కూడా పరిశోధనల ఆధారంగా సవరించుకుంటే తప్పేమిటి ? వాస్తు శాస్త్రంపై పట్టు సాధించాలంటే సాంకేతికమైన విషయాలను అర్ధం చేసుకొనే సామర్థ్యం ఉండాలి. అది లేని వారు పండితులు గా మారి ఆయం, అర్వణం లాంటి నిరర్థక విషయాల గురించి మాట్లాడుతున్నారు.

2. Concept Selling

ఉత్పత్తులు(products) లేదా సేవ(service)లను విపణిలో అమ్మాలంటే వ్యాపారస్తులు కొన్ని పద్ధతులు పాటిస్తారు. అందులో ఒకటి concept selling. ఏదైనా ఉత్పత్తి యొక్క ఒక ప్రత్యేకమైన లక్షణాన్ని వినియోగదారుల దృష్టిలో ఎక్కువగా పడేలా చేయడం తద్వారా ఉత్పత్తి యొక్క అమ్మకాలను పెంచడమే concept selling, అయితే చెప్పబడిన లక్షణం నిజం కావచ్చు లేదా అబద్దం కావచ్చు. చెప్పబడిన లక్షణం నిజమైతే అందులో ఎటువంటి అనైతికత లేదు. చెప్పబడిన లక్షణం అబద్దం అయితే అది అబద్దం అని అందరికి తెలిసే లోపు తాము ఆశించిన లాభాలు గడించి విపణిలో నుంచి మాయం అవుతారు. కొందరు వాస్తు పండితులు ఇలాంటి పద్ధతులనే అవలంభిస్తుంటారు.

కొంత కాలం క్రితం కొందరు పండితులు బ్రహ్మ స్థానం గురించి అదేపనిగా మాట్లాడడం మీరు వినే ఉంటారు. సర్వ సమస్యలకు బ్రహ్మ స్థానం తెరచి ఉంచటమే పరిష్కారం అని తీవ్రంగా ప్రచారం చేసారు. కేవలం బ్రహ్మ స్థానం ఏర్పాటు తో అన్ని సమస్యలు తీరుతాయంటే అందరు ఆకర్షితులు అవుతారు. ఇల్లంతా సమగ్రంగా పరిశీలించి ఎటువంటి దోషాలు లేకుండా ఇంటిలో మార్పులు చేయాలి, అప్పుడే ఫలితం ఉంటుంది అంటే ఎవరికీ రుచించదు. బ్రహ్మస్థానం ప్రహసనం కొన్ని నెలలు నడిచివుంటుంది. తరువాత “అన్ని సమస్యలకు ఒకటే మందు, అదే స్థాపత్యవేదం ” అని మరికొన్ని నెలల పాటు మరో ప్రహసనం తరువాతి ప్రహసనం మధ్య ద్వారాల గురించి. తక్కువ కాలంలో ఎక్కువ మొత్తం సంపాదించాలన్న దురాశతో ఇలాంటి పద్ధతులు అవలంభిస్తుంటారు. అలాంటి వారు విపణిలో ఎక్కువ కాలం ఉండరు. వారు చెప్పినట్లు బ్రహ్మ స్థానాన్ని ఏర్పాటుచేసుకున్నవారికి ఎలాంటి ఫలితాలు వచ్చాయో అందరికి తెలిసేలోపు సమాజంలో నుంచి మాయం అవుతారు. రక్తంలో చక్కెర స్థాయి, బి పి మరియు అన్ని పారామితులు సరిగ్గా ఉన్నపుడే మనిషి ఆరోగ్యంగా ఉన్నట్టు కదా? అలాగే ఇంటిలో ఏ దోషం లేకుండా ఉన్నపుడే మనిషి జీవితం సాఫీగా నడుస్తుంది. బ్రహ్మ స్థానమో లేక మధ్య ద్వారమో మీ సమస్యలను తీర్చుతుందనుకుంటే మీరు మోసపోయినట్లే. సత్వర మార్గాలు (short cut) వాస్తు శాస్త్రం విషయంలో నష్టాన్నే కలిగిస్తాయని గుర్తుంచుకొండి,

3. ఏ శాస్త్రం లోనూ లేని విషయాలు

పురాతణ వాస్తు శాస్త్ర ఉద్ధారకులుగా తమను తాము అభివర్ణించుకొనేవారు ఆధునిక వాస్తు శాస్త్రం యొక్క ప్రామాణికత గురించి ప్రశ్నిస్తుంటారు. వారు అనుసరించే దానికి గ్రంథాలే ప్రమాణం అయితే వారు గ్రంథాలలో లేని రంగు నీళ్లు, ప్రతీకలు, రాగి కడ్డీలు, రంగు పట్టీలను remedies గా ఎందుకు ఉపయోగిస్తున్నారు. ఆరా స్కానర్ (aura scanner)ను ఉపయోగించి ఇంటిలో ఉన్న వాస్తు దోషాలు కనుగొనమని ఏ గ్రంథంలో ఉందో చెప్పాలి. రాగి తీగలు ఇంటికి చుడితే వాస్తు దోషాలు తొలగిపోతాయని ఏ గ్రంథంలో ఉందో వారే చెప్పాలి. పురాతణ గ్రంథాల ప్రకారం వాస్తు దోషాలు ఉంటే మత్స్య యంత్రాన్ని స్థాపిస్తే సమస్య పరిష్కారం అవుతుంది. మరి దానిని ఎందుకు పాటించటం లేదు. లోలకం (pendulum) తో డౌసింగ్ (dowsing) చేసే ప్రక్రియ ఏ పురాణం లో ఉంది? ఋషులు, పురాణాల పేరు చెప్పి ఋషులు చెప్పని వాటిని పురాణాలలో లేని వాటిని వాస్తు పేరుతొ ప్రజలకు ఎందుకు అంటగడుతున్నారు ? దిక్సూచిని ఇంటి మధ్యలో ఉంచి ద్వార నిర్ణయం చేయమని కానీ దానికి సమాన మైన పద్దతి కానీ ఏ గ్రంథంలో కూడా ఉండే అవకాశం లేదు. వాస్తు చక్రం ఉపయోగించి zone లను గుర్తించమని కూడా ఉండదు. ఇక శాస్త్ర పరిధిని దాటి ప్రవర్తించేది ఎవరో చెప్పవలసిన పని లేదు కదా? ఆధునిక వాస్తు శాస్త్రజ్ఞులు కేవలం నిర్మాణపరమైన (structural) మార్పులను మాత్రమే దోషాలకు పరిష్కారంగా సూచించారు. అంటే వారు వాస్తు శాస్త్ర పరిధిని దాట లేదని అందరు తెలుసుకోవాలి.

కొంత మంది టీవీ, ఫ్రిజ్ మరియు ఏసి లాంటి ఉపకరణాలను ఎక్కడ ఉంచాలో కూడా చెబుతూ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారు. అసలైన వాస్తు నియమాలు కాకుండా వస్తువుల అమరికయే వాస్తు శాస్త్రం అని ప్రజలకు అపోహ కలిగేలా వ్యవహరిస్తున్నారు. ప్రజలు కూడా ఉచితంగా లభించే సలహాలు కావడంతో వింటున్నారు పాటించడానికి ఖర్చు కాదు కాబట్టి పాటించడానికి ప్రయత్నిస్తారు. కొందరు పండితులు ఇంకా దిగజారి అద్దం పలానా చోట పెడితే కోటీశ్వరులు కావడం ఖాయమని ప్రచారం చేస్తున్నారు. ఉప్పు కలిగి ఉన్న చిన్న చిన్న గిన్నెలను ద్వారానికిరువైపులా మరియు గదుల మూలలో ఉంచితే ఆ ఉప్పు వల్ల ప్రతికూల శక్తులు బయటకు పోతాయని మరియు సమస్యలు తొలగిపోతాయని వాస్తు పండితులు చెప్పడం పిచ్చితనం. కిలో ఉప్పుతో సమస్యలు తొలగిపోతే ఇక వాస్తుశాస్త్రంతో పని ఏముంది. ఇతరుల వద్దనుంచి తీసుకున్న డబ్బును ఉప్పులో కొన్ని రోజుల పాటు ఉంచాలని చెప్పటం పిచ్చికి పరాకాష్ట. వాస్తు సలహాదారులుగా చెప్పుకొనేవారు ఇలాంటి పనికిమాలిన సలహాలు ఇస్తే వాస్తు శాస్త్రం కూడా అలాంటిదేనని ప్రజలు భావించే అవకాశం ఉందని కూడా గుర్తించడం లేదు.

బిందెలను మరియు చెంబులను కూడా కొన్ని ప్రత్యేకమైన కొలతల ప్రకారం తయారు చేసుకొని వాటిలో నిల్వ ఉంచిన నీటిని సేవించినపుడు సమస్యలు పరిష్కారం అవుతాయని చెబుతున్నారంటే పిచ్చి ఏ స్థాయిలో ఉందొ అర్ధం చేసుకోవాలి. ఆ కొలతలు కూడా మనిషి యొక్క జన్మ నక్షత్రాలకు అనుగుణంగా ఉండాలట. వారు లెక్కించి ఇచ్చిన కొలతల ప్రకారం తయారుచేయబడిన మంచాలలో శాయనిస్తే భర్య భర్తల సమస్యలు తీరిపోతాయట. బిందెలు చెంబులతో సమస్య పరిష్కరించగలిగినపుడు ఇంటి యొక్క వాస్తు తో పని ఏమిటి?

4. ఇంటిలో మార్పులు చేసిన సమస్యలు తొలగిపోలేదా ?

ఇల్లు వాస్తు నిపుణుడి సలహా ననుసరించి కట్టారా ? అయినా సమస్యలు వచ్చాయా ? వాస్తు సలహాదారుని సూచనల మేరకు ఇంటిలో మార్పులు చేసారా ? అయినా సమస్యలు పరిష్కారం అవ్వలేదా ? క్రొత్త ఇంటిలో సమస్యలు వచ్చాయంటే వాస్తు నిబంధనలకు అనుగుణంగా మీరు కట్టినట్టుగా భావిస్తున్న ఇంటిలో దోషాలు ఉన్నాయని. ఇంటిలో మార్పులు చేసిన తరువాత కూడా ఇంకా సమస్యలు తీరలేదంటే దాని అర్థం ఆ ఇంటిలో ఇంకా వాస్తు దోషాలు ఉన్నాయని.

సలహాదారుడు సరైన సూచనలు ఇవ్వక పోవడం వల్ల క్రొత్త ఇంటిలో దోషాలుతలెత్తవచ్చు. పాత ఇంటికి వాస్తు పరమైన మార్పులు చేయడానికి అవసరమైన సలహాలు నిపుణుడు సరైన రీతిలో ఇవ్వకపోవడం వల్ల దోషాలు తొలగిపోక వచ్చు. వాస్తు శాస్త్రం అన్నది పరిశోధనల ఆధారంగా ఉద్భవించినది మరియు పరిశోధనల ఆధారంగానే అభివృద్ధి చెందుతుంది. అభివృద్ధికి అవకాశం మరియు అవసరం ఉందంటే దాని అర్థం అప్పటికి తెలియని దోషాలు ఉండి ఉండవచ్చు. అంటే ఎంత నిపుణుడైన సలహాదారుడైనా ఎవరికీ తెలియని దోషాలు తలెత్తితే ఏమి చేయలేడు.

చాలా ఏళ్ల క్రితం నేను కూడా నా గృహాన్ని అందుబాటులో ఉన్న ఆధునిక వాస్తు గ్రంథాల ప్రకారం నిర్మించాను. కొంత కాలం వరకు ఫలితాల కోసం ఎదురు చూసాను. అనుకున్న ఫలితాలు రాక పోవడంతో నేనేమైనా పొరపాట్లు చేసానేమోనని మళ్ళీ గ్రంథాలను తిరగేసాను. అయితే ఎటువంటి లోపాలను కనుకగొనలేక పోయాను. చాల కాలం తరువాత ఇంటిలో ఏవో తెలియని దోషాలు ఉన్నాయని అనుమానించి పరిశోధించడం మొదలు పెట్టాను. చాలా ఏళ్ల పరిశోధన తరువాత ఆ లోపాలను కనుగొన్నాను. అయితే జ్యోతిష్యాన్ని వాస్తు శాస్త్రంతో మిళితం చేసే పురాతణ వాస్తు పండితులు వాస్తు శాస్త్రం ద్వారా సమస్యలు తీర్చలేనపుడు గ్రహస్థితి ని సాకుగా చూపుతారు.

మనిషికి అనారోగ్య లక్షణాలు ఉంటే శరీరంలో వ్యాధి ఉన్నట్టే కదా ? రోగ లక్షణాలను బట్టి మరియు కొన్ని పరీక్షల ద్వారా వైద్యుడు వ్యాధిని నిర్ధారిస్తాడు. అప్పటికి తెలియని క్రొత్త వ్యాధి కలిగినపుడు వైద్యులు పరిశోధన ద్వారా నిర్ధారించి దానికి చికిత్స ను అభివృద్ధి చేస్తారు. పూర్వం కొన్నిసార్లు అంతుబట్టని వ్యాధులతో మనుషులు చనిపోయేవారు. అయితే ఇప్పుడు వైద్య శాస్త్రం బాగా అభివృద్ధి చెందడంతో ఎన్నో వ్యాధులకు కారణాలను కనుగొని చికిత్సను రూపొందించారు. వాస్తు శాస్త్రంలో కూడా క్రొత్త దోషాలు ముందుకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి వాస్తు నేను ఎప్పటికీ నమ్మే సత్యం సలహాదారులు పరిశోధనాత్మక దృష్టిని అలవర్చుకొని పరిష్కారాలు కనుగొనాలి “సమస్యలు ఉంటే దోషాలు ఉన్నట్టే మరియు దోషాలు ఉంటే సమస్యలు వచ్చి తీరుతాయి”,