దక్షిణపుస్థలములు వాని లక్షణములు
దక్షిణభాగమున వీధిగల స్థలమును దక్షిణ స్థలమనబడును. అట్టి దక్షిణవు స్థలమున దక్షిణ సింహద్వారము పెట్టి గృహము కట్టుట చాలా ఉత్తమము. అట్టి గృహమున నివసించువారును, జన్మించినవారును, స్వాతంత్ర్యము, పౌరుషము, గర్వము వీరికి అధికము. వీరు ఇతరులను గౌరవించి తాముకూడా గౌరవించబడుదురు. వీరు నూతన పదతులను అవలంబించుటయు, నూతన ఆశయములు కలియుండుటయు కలుసు. వీరు ఒనరించు కార్యక్రమములు వ్యక్తిత్వము కొట్టవచ్చినట్లు కనిపిం చును. వీరికి భారీసంస్థల బాధ్యతాయుతము, అధికారయుతమైన ప్రభుత్వోద్యోగములు, వీరి వృత్తులైయుండును. వీరికి జ్ఞాపకశక్తి అధికము. శత్రు ప్రాబల్యము అధికము, ఖర్చు అధికము. సంపన్నులై, దాతృగుణము కల్గి, ఒకరిని కాపాడుటయందు సమర్థులైయుండి, మంచి పేరు ప్రఖ్యాతులు గడించెదరు. దక్షిణపుస్థలమున తూర్పు, పడమర, ఉత్తరముల సింహద్వార గృహములు నిర్మించరాదు. అట్లు నిర్మించిన అధిక వ్యయము, శత్రుపీడ, భూతవీడ, బలవన్మరణములు, అశాంతి కల్గును.
దక్షిణ దిశకు గ్రహాధిపతి కుజుడు, పాలకుడు యముడు, వాహనం దున్నపోతు.
దక్షిణమునకు గ్రహాధిపతి అంగారకుడు (కుజుడు). సాధారణంగా కుజ దోషమున్న వారికి దక్షిణ భాగం కూడా దోషం కలిగి ఉంటుంది. గురువర్గమునకు కుజుడు విశ్వాసపాత్రుడు. గురుగ్రహము సౌమ్యగ్రహము. అత్యంత బలవంతుడైన శని గ్రహానికి గురుగ్రహము తట్టుకోలేనందువల్ల సర్వేశ్వరుడు కుజుని సృష్టి కావించాడు. శనికి తత్సమానమైన శక్తి కలిగినవాడు. మీరుకూడా అక్కడక్కడా జాతకంలో కుజదోషం ఉంది అని విని ఉంటారు. దిక్కులలో శని పశ్చిమాన్ని ఆక్రమించగా, తత్సమానంగా కుజుడు దక్షిణాన్ని ఆక్రమించివున్నాడు.
దక్షిణ దిక్కు ఉత్తరము కన్ననూ మెరక అయ్యి (ఎత్తు), ఏ గుంటలూ లేకుండగా, వంకర టింకర లేకుండగా ఉన్నచో ఆడవారికి చక్కటి ఆలోచనలు, వారి మాటలో బలము, మగవారికన్నా ఆడవారికే కాస్త గుర్తింపు ఎక్కువ, స్పష్టత కలిగిన మాట, ఐశ్వర్యము, సమృద్ధిగా ధనము, రైతుల ఇళ్ళలో అయితే సమృద్ధిగా పాడి, కొత్త ఆస్థులు కొనుగోలు చేయడం, బంగారు కొనుగోలు చేయడం, వంటినిండా నగలు ధరించడం, జేబునిండా ధనం, ఆడపిల్లలకు త్వరగా పెళ్ళిళ్ళు కావడం, ఆడపిల్లలు విదేశాలకు వెళ్ళడం, మంచి దాంపత్య జీవనం లభించడం, తాంబూల సేవనం, ఎర్రగా పండిన నోరు, పెదవులపై నవ్వు, సునిశిత దృష్టి, ఎదుటివారిని సరిగా అంచనా వేయడం, ఇచ్చిన అప్పులు త్వరగా వసూలు కావడం, చేస్తున్న వ్యాపారం త్వరగా అభివృద్ధి చెందడం తదితర శుభములు కలుగును.
దక్షిణదిక్కు ఉత్తరముకన్ననూ పల్లముగా ఉన్నచో, వంకర టింకరగా ఉన్నచో, నైఋతి మూల లేక ఆగ్నేయమూలలోనో ఎక్కువగా పెరిగి గుంటలు, కుంటలు, పెద్ద కాలువలు, వాలు వరండాలు, దక్షిణ నైఋతి భాగంలో వాకిళ్ళు తదితర దోషములు ఉన్నప్పుడు ఆ ఇంటి ఇల్లాలు ఆనారోగ్య పీడితురాలై ఏ సుఖానికీ నోచదు. ధననష్టము, ఆనారోగ్యము, మానసికబాధ, ఉన్నది అమ్ముకోవడం, దుర్వ్యసనాలు, మరణాలు తదితరములు సంభవము. దక్షిణ భాగ విషయంలో జాగ్రత్తగా ఉన్నచో ఆర్థిక పరిపుష్టి, ఇంటి ఇల్లాలు సుఖపడడం జరుగుతుంది.

