గృహప్రవేశ విధానము
గృహ నిర్మాణ కార్యక్రమానంతరము ద్వారబంధమును తలుపులు అన్ని ఏర్పాటుగావించుకొని శుభ మాసమున శుభ పక్షమున శుభదినమున శుభ నక్షత్రమున శుభలగ్న ముహూర్తమున గృహప్రవేశము చేయవలెను.
గృహప్రవేశ కాలమున గృహయజమాని భార్య పుత్రులు, బంధువులు, భారత, రామాయణ, భాగవత, పుణ్యగ్రంథములు, కలశము, పసుపు, కుంకుమ, పుష్పములు, పాలు, దేవుని పటము నీళ్ళ బిందెలు, ధాన్యము, ఉప్పు, పాలు, పెరుగు, శ్రీ గ్రంధచందనము, అగరు పన్నీరు, తమలపాకులు, గుమ్మడికాయలు కొబ్బరిబోండములు, పండ్లు మొదలగు వానిని తీసుకొని మంగళవాద్యములు జరుగుచుండగా వేదపండితుల ఆశీర్వచనములు పలుకుచుండగా ముందుగా పాలిచ్చు చున్నగోవును దూడతో సహా ప్రవేశ పెట్టి తదుపరి గృహయజమాని దంపతులు బంధుమిత్ర సహోదరబృందముతోసహా గృహమునప్రవేశించి ఒక గుమ్మడికాయపై కర్పూరము వెలిగించి ద్వారబంధమున గాని, గర్భమునగాని పగులగొట్టవలయును. ఆ కలశమును ధాన్యముపై పెట్టి చుట్టూ ద్వారముల చెంత ధాన్యము చల్లి సనంతరం విఘ్నేశ్వరపూజ పుణ్యాహవాచనము జరిపించి వాస్తుపురుష హోమము దిక్పాలకులు నవగ్రహములు పూజసల్పి, ఆగ్నేయభాగమున హారతి కర్పూర సహాయముతో అగ్ని హోత్రము చేసి, పాలు పొంగించి, పొంగలి, పాయసము చేయించవలెను. ఇంటిలో గుమ్మములవద్ద ప్రమిదలయందు నేతితో దీపారాధన చేయించవలయును. వెంట తెచ్చిన ఆవిరికుడుములు ద్వారములందు పెట్టుట గృహము నావిరి చూవుట నీళ్ళబిందెలు ఈశాన్యముగా పెట్టవలయును వెంట తెచ్చిన ధాన్యము వాయవ్య గదిలో వుంచవలయును. ఆ రాత్రిపూట నిదురించక భారత, రామాయణ, భాగవత పుణ్యగ్రంథములు పఠనము గాని భజన కార్యక్రమము చేయుటగాని జరిపించవలయును.

