వాయవ్య స్థలములు వాని లక్షణములు
పడమర ఉత్తరం వీధులుగల స్థలమును వాయవ్వ స్థలమున పడమర సింహద్వారము పెట్టి నిర్మింబడును. అట్టి వాయవ్యస్థలమున పశ్చిమ సింహద్వారం పెట్టి నిర్మించిన అందునివసించు వారలకు, జన్మించిన వారలకు ఆత్మశక్తి, ధీరత్వము, నిశ్చితాభిప్రాయము, అమితమైన జ్ఞాపకశక్తి, పేరు ప్రతిష్టలు, సంఘగౌరవము, న్యాయవర్తనము, కార్యసాధన, రాజకీయ చతురత, ప్రతివిషయములను హేతుబద్ధముగా ఆలోచించు శక్తి కలిగియుందురు. వీరు ధనసంపాదనకన్నా, గౌరవమర్యాదలకు ప్రాధాన్యము నిచ్చెదరు. వీరు ఇతరులకు కష్టకాలములయందు సహాయపడుటయు, ధైర్యముచెప్పి, ప్రోత్సహించుటయందు కడునేర్పరులు. వాయవ్యస్థలమునకు తూర్పు, ఉత్తర, దక్షిణ సింహద్వార గృహ ములు నిర్మింపరాదు. అట్లు నిర్మించిన పిరికితనము, ధననష్టము కల్గి కష్టజీవనము కల్గును.
వాయువ్య మూలకు గ్రహాధిపతి చంద్రుడు, పాలకుడు వాయుదేవుడు మరియు వాహనం జింక. మూడింటినీ గమనిస్తున్నారు కదూ! వీటిలో రెండు అత్యంత వేగవంతమైనవి. ముఖ్యంగా వ్యాపారములు చేసుకొనువారు షేర్లు, తదితర పెట్టుబడుల వ్యాపారం చేసేవారు వాయువ్య విషయంగా తగిన భద్రతా, జాగ్రత్త చర్యలు తీసుకోవలసి ఉంటుంది. ఈ వాయువ్య భాగము ఇంట ఆడవారిపై మరియు మూడవ సంతతిపై ఎక్కువగా ప్రభావం చూపించును.
వాయువ్య దోషము ఏమియూ లేకుండా ఉన్నచో మానసికంగా ఇంటివారు స్థిరత్వము కలిగి ఉంటారు. మరియు ఇంట ధనము నిలువ ఉండును. వ్యాపారము బాగుగా జరుగును. ఆడవారు కులాసాగా ఉందురు. ఇంట స్త్రీ సుఖపడును. సంతానము అభివృద్ధి అగును. మేధావుల జననం, తెలివితేటలు సమృద్ధిగా ఉండటం, ఆర్థిక భద్రత, ఇతరత్రా.
ఒక్క మాటలో చెప్పాలంటే వాయువ్యదోషమంటే చేతిలో నిప్పు కణిక ఉన్నట్లే. వాయవ్య మూల వల్ల సత్ఫలితములు తక్కువ, దుష్ఫలితములు భారీగా ఎక్కువ. వాయవ్యము పెరిగిననూ, గుంతలు, బావులు, పెద్ద కాలువలు, వాకిళ్ళు (తలుపులు) ఉత్తర వాయువ్య వీధిపోటు, ఇంటికి ఆనుకొని ఇంటిలోపలి నేలకన్నా పెద్ద అరుగులు ఉండి, తదితరముల దోషములు ఉన్నచో ఇంటివారికి మానసిక శాంతి అసంభవం. మనిషి మనస్సుపై ఈ వాయువ్య మూల దోషం అత్యధికముగా ఉండును. ఎక్కువగా పిచ్చిపట్టినవారిని గమనిస్తే వారింటికి వాయువ్య దోషాలు చాలా ఎక్కువగా ఉండడం గమనించడం జరిగినది. ముఖ్యంగా దివాళా తీసిన ఇళ్ళల్లో వాయువ్య దోషాలు ఎక్కువగా ఉంటాయి. వాయువ్య దోషమున్న వారికి ఋణములు (అప్పులు) తప్పనిసరి. అప్పులవారితో మానసిక అశాంతి నశించి పోవడం, ఏ పనిపై ధ్యాస లేకపోవడం, ఆత్మహత్యలు చేసుకోవడం, ఇళ్ళు అమ్ముకు వెళ్ళిపోవడం, అప్పులు వల్ల వేగలేక ఇంటిని తాకట్టుపెట్టడం లేదా అప్పుల వారికి అమ్మివేయడం, పరాధీనము గావించడం, వ్యాపార నష్టాలు, మగవారిపై స్త్రీకి ఉన్న సదభిప్రాయము తొలగి పోవడం, మనోచాంచల్యం, అక్రమ పద్ధతుల ద్వారా ధనాన్ని ప్రోగుచేయడం, అబద్ధాలు ఎక్కువ మాట్లాడడం, అనవసరమైన విషయాలను ఎక్కువ చేసి ఉన్నవారి మధ్యలో అవమానాలపాలు కావడం లేదా విలువ తగ్గిపోవడం, రాజుగా ఉన్నవాడు బికారిలా అయిపోవడం, స్థిరమైన భద్రత కలిగిన జీవితం కలలో మాత్రమే లభించడం తదిరములు సంభవం.

