ఈశాన్య స్థలములు వాని లక్షణములు
తూర్పు ఉత్తర వీధులుగల స్థలమును ఈశాన్య స్థలములు అనబడును. అట్టి ఈశాన్యస్థలమున తూర్పువిస్తారముగా ఖాళివదలి పెట్టి తూర్పు సింహద్వార గృహములు ఉత్తరము విస్తారముగా ఖాళీవదలి పెట్టి ఉత్తర సింహద్వార గృహములు నిర్మించుకొని అందు నివసించువారలకు, జన్మించినవారలకు విజ్ఞానవంతమైన ఆలోచనకల్లుట, యితరులచే ఆకర్షించునట్లు చురుకుతనముకల్గి తాముచేయు కృషియందు అభివృద్ధినొందగలరు. వారు బాధ్యతలయందు క్రమబద్ధముగా నిర్వర్తించ గలవారగుదురు. మానసిక కష్టములందైన కడు ధైర్యముగా కనిపించెదరు. వీరు చేయు పనులు చాకచక్యముగా నుండగలవు. వీరికి ఆశ యెక్కువ. దానధర్మములయందు ఆసక్తి తక్కువ. వీరు జీవితములో కష్టసుఖములు సమముగా అనుభవించుదురు. స్వయంకృషి వలస పైకి రాగలరు. చర స్థిరస్థులును సంపాదించగలరు. ధనము నిలువయుంచుట యందు కడుసమరులు.
ఈశాన్య భాగమునకు (మూల) గ్రహాధిపతి బృహస్పతి అనగా గురువు, దేవతలకు గురువు మరియు కేతువు (జ్యోతిషశాస్త్ర రీత్యా రాహువు ఉన్న ఎదురింటిలో కేతువు ఉండును అనగా మేషమునందు రాహువు ఉన్నచో, తుల యందు కేతువు ఉండును. ఇరువురు ఒక ఇంటిలో ఉండటం అసంభవము. అందువల్ల గ్రహము అనునది జ్యోతిష శాస్త్రమునకు సంబంధించినది. కావున ఈశాన్యము దిక్కుకు గురువుతో పాటుగా కేతువును చూపించడం జరిగినది. కావుననే జ్యోతిష శాస్త్ర రీత్యా రెండు గ్రహములు ఒక ఇంట ఉన్నందువల్ల రెండు గ్రహములకు కావలసిన స్థలము ఇవ్వవలసి ఉంటుంది. తద్వారా తప్పనిసరిగా ఈశాన్యమును పెంచవలసి ఉంటుంది. అయితే వాస్తుశాస్త్ర రీత్యా నైఋతినందు రాహువు మరియు కేతువులను చూపిస్తారు. ఈ విషయమును మరీ మరీ గమనించవలసినదిగా నా ప్రార్ధన) పాలకుడు అత్యంత శక్తిమంతుడైన సర్వేశ్వరుడు, ముక్కంటి, నీలకంఠుడు, పిలిస్తే పలికేవాడు, భోళాశంకరుడు, ఉమాపతి. వాహనము నందియై ఉన్నది.
గురువు సమాధానం :- ఈశాన్యము శుభముగా ఉన్నచో అనగా ఈశాన్యము పెరగడము, ఈశాన్యము పల్లము కావడము తదితరములు ఉన్నచో సకల సంపదలు, నిత్యానందము, మహా అభివృద్ధి, ఆరోగ్యము, ఇంట కళకళ, అదృష్టము, సంతతి అత్యంత త్వరగా అభివృద్ధిలోకి రావడం, మగ సంతానం, ప్రయోజకత్వము కలిగిన కుమారులు.
ఈశాన్యము వల్ల దుష్ఫలితాలంటూ ఏమీ వుండవు. అయితే ఈశాన్యము కోత పడడం మరియు బరువు ఉండడం, తగ్గిపోవడం, మూసుకొని ఉండడం తదితర కారణముల వలన ఇంట అనారోగ్యాలు, మందులచే బాగుపడని రోగాలు అనగా గుండెపోటు, క్యాన్సరు తదితర రోగాలు, వంశనాశనము, ఆర్థిక పరిస్థితి నాశనమవడం, సంతతి లేకపోవడం, ఇతరులు దత్తుకు రావడం, సంతానమున్నా అప్రయోజకులై ఉందురు. పనికిరాని పనులకై ప్రాకులాడి ధననష్టం పొంది చెడుపేరు సంపాదించుకుందురు. త్వరగా పెళ్ళిళ్ళు కావు. పిల్లలకు భయంకర వ్యాధులు రావడం ఇతరత్రా దుష్ఫలితాలు సంభవం.

