తిరుమలలో ప్రథమంగా దర్శించి పూజించాల్సింది శ్రీ వరాహస్వామినే. ఆయన్ని దర్శించి, పూజించిన తరువాతనే శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించి పూజించాలని పురాణాలలో ఉంది. తిరుమలలో శ్రీ వేంకటేశ్వరుని ఆలయానికి ఆనుకొని వున్న పుష్కరిణి ఒడ్డున ఉత్తర దిక్కున శ్రీవరాహస్వామి ఆలయం ఉంది. కృత యుగంలో భూమిని చాపగా చుట్టివేసిన హిరణ్యాక్షుడనే రాక్షసుడిని సంహరించడానికి అవతరించిన విష్ణుమూర్తే వరాహస్వామి. ఆయన దేవేరులైన మహాలక్ష్మి, భూదేవులతో కొండమీద స్థిరపడడానికి కారణంగా ఓ పురాణ గాథ వుంది.
కలియుగంలో వేంకటేశ్వరుని అవతారమయిన విష్ణుమూర్తి తన వక్షస్థలాన్ని తన్నిన భృగుమహర్షిపైన ఆగ్రహం చూపక పోగా ఆయనకు పాద సపర్య చేయడాన్ని సహించని శ్రీ లక్ష్మీదేవి వైకుంఠవాసుడయిన విష్ణుమూర్తిని విడిచిపెట్టి కొల్హాపురం
వెళ్ళిపోవడంతో వేంకటేశ్వరుని అవతారమయిన విష్ణుమూర్తి ఆ వియోగంలో వేంకటాచలానికి (వేంకటాద్రి) రావడం, అక్కడ పశువుల కాపరి విసిరిన కఱ్ఱ వేంకటేశ్వరుని తలకు తగిలి రక్తం ధారలు కట్టడం ఆ గాయాన్ని మాన్పుకోవడానికి అడవిలో సంచరిస్తున్న వేంకటేశ్వరునికి వరాహస్వామి 100 × 100 అడుగుల విస్తీర్ణము కలిగిన స్థలాన్ని దానం చేసినట్లు పురాణాలు చెప్తున్నాయి. అయితే వేంకటేశ్వరుడు, వరాహస్వామిఇచ్చిన100×100 అడుగులతో సరిపుచ్చు కోక పూర్తిగా ఆక్రమించుకొన్నాడనుకోండి. శ్రీ లక్ష్మీదేవి లేని వేంకటేశ్వరుడు ఆయనకు కృతజ్ఞతగా ఏమీ ఇవ్వలేని వాడయినందున తనకు వచ్చే కానుకలతో వరాహస్వామికి మొదటి పూజ జరిపిస్తానని మాట ఇచ్చాడట.
ఆ మాట ప్రకారమే నేటికి వరాహస్వామికి పూజ, నైవేద్యం జరిగిన తర్వాతనే వేంకటేశ్వరునికి పూజ, నైవేద్యం జరుగుతున్నాయి. తన భక్తులను కూడా మొదట వరాహస్వామిని దర్శించి, అర్చించిన తరువాతనే తనను దర్శించి, అర్చించుకో వలసిందిగా సెలవిచ్చాడట వేంకటేశ్వరుడు.
వరాహస్వామి వేంకటేశ్వరునికి స్థలం దానమిచ్చిన రాగిరేకు దానపత్రం వరాహ స్వామి గుడిలో వుంది. వరాహస్వామికి అర్చన రుసుము (ఒక రూపాయి) హారతి (50 పైసలు) చెల్లించిన భక్తులకు అర్చకుడు ఆ దానపత్రాన్ని చూపిస్తుంటాడు.
తిరుమల కొచ్చే యాత్రికులు వరాహస్వామిని దర్శించి వేంకటేశ్వరుని దర్శిస్తే గాని తిరుమల యాత్ర పరిపూర్ణమవదని పెద్దలు చెపుతుంటారు. పుష్కరిణి స్నానం, వరాహస్వామి, వేంకటేశ్వరస్వామి దర్శనం, మహా ప్రసాదం స్వీకరించడం అనే మూడు ముల్లోకాలలో దొరికేవి కావు అని పెద్దలంటారు.
వరాహస్వామి ఆలయం వేంకటేశ్వరుని ఆలయంతోపాటే వేకువ జామున 3 గంటలకు తెరుస్తారు. రాత్రి సుమారు 10 గంటల వరకు తెరచి వుంచుతారు. వరాహస్వామి ఆలయంలో ఒడిలో కూర్చున్న భూదేవితో వరాహస్వామి, వేంకటేశ్వర స్వాముల ఉత్సవ మూర్తులు, సుదర్శన సాలగ్రామం ఉన్నాయి. వరాహస్వామి మెడలో దశావతారం, సాలగ్రామమాల వుంది. హారతి ఇచ్చే సమయంలో మాల స్పష్టంగా కనబడుతుంది.ఇంత మహత్తర చరిత్రగల ఈ దేవాలయం యోగించక పోవుటకు కారణాలు దానికున్న వాస్తు దోషాలే. తిరుమల గిరిపై వరాహస్వామి వారి ఆలయం పుష్కరిణికి వాయవ్యంలో ఉన్నది. ఆ గుడికి వైరృతి, దక్షిణము, మరియు ఆగ్నేయము పల్లము అయినవి. అంతేగాక ఉత్తరం వైపు బజారు ఉన్నతమై యున్నది అందుకే శ్రీ బాలాజీవారి కన్నా ముందు వరాహస్వామి వారిని దర్శనం చేసికొనవలసినదిగా మైకులలో ఎంత ప్రకటించినను నూటికి 10 మంది కూడా ఆ ఆచారాన్ని పాటించుట లేదు. వాస్తు శాస్త్రానికి అనుగుణంగా వున్న తిరుమలపై వరాహస్వామి వారి ఆలయమున్నను, ఆ గుడి పరిసర వాస్తునకు వ్యతిరేకంగా వున్నందున వరాహస్వామి వారు నిరాదరణకు గురియైనారు.

