లేపాక్షి దేవాలయం అనంతపురం జిల్లా హిందూపురానికి 16 కి.మీ. దూరంలో వుంది. ఈ దేవాలయ స్థల పురాణం రామాయణగాథకు సంబంధించింది.
ఒక నిర్మాణాన్ని మామూలు ఇంజనీరు చూస్తే దాని నిర్మాణ పటిష్ఠతను పరిశీలిస్తాడు. ఒక కళాకారుడు ఆ నిర్మాణమందలి కళాకౌశలాన్ని అవలోకిస్తాడు. ఒక మామూలు మనిషి దాని సొగసును చూచి శభాష్ అంటాడు. ఒక వాస్తు పరిశోధకుడు దాని దిశలను, మూలలను, దాని ఆవరణమును గదుల కొలతలను గమనిస్తాడు. దాని ఫలాలను వాస్తు జ్ఞాన పరిధిలో బేరీజువేస్తాడు.
ఆ దృష్టితో ‘లేపాక్షి’ చూస్తే అది గత వైభవాన్ని కోల్పోయి, అందలి శిల్పకళ నిరాదరణకు ఎందుకు గురి అయిందో ఈ క్రింది వివరణతో విశదమవుతుంది.
1. ఈ ఆలయపు ఉత్తర సింహద్వారం యొక్క ఈశాన్యం తగ్గిపోయింది.
2. గుడియొక్క సింహద్వారం నుండి వెలుపలి మెయిన్ రోడ్డుకు ఆగ్నేయ, వాయవ్యాలలో నడక సాగింది.
3. దేవాలయ ప్రథమ ప్రాకారంలో ఈశాన్యం మూతపడింది. ఈశాన్యం కప్పు జీవితానికే ముప్పు.
4. తూర్పున ఖాళీ 39 అడుగులుంటే పడమటి వైపున ఖాళీ 86 అడుగులుంది. ‘పశ్చిమం ఖాళీ స్థలం” వాస్తు పరంగా అశుభం.
5. తూర్పుదిశలో మహాద్వారముండి కూడా మూత వేయబడింది. అది తప్పు.
6.దక్షిణంవైపు ఖాళీస్థలం 20 అడుగుల 3 అంగుళాలు, ఉత్తరం వైపున 15 అడుగులు మాత్రమే ఉంది. దక్షిణాన ఎక్కువ ఖాళీస్థలం చెడ్డ ఫలితాలనిచ్చే వాస్తు దోషం.
7. పశ్చిమాన నీరు నిలిచియున్న ఒక గొయ్యివుంది. ఈ గొయ్యిని ఆనుకొని వున్న కల్యాణ మంటప నిర్మాణం అసంపూర్ణంగా ఆగిపోయింది. ఎన్నో పుణ్యక్షేత్రాలకు యాజమాన్యభారం వహించిన ఎండోమెంటు శాఖ కూడా ఈ శిల్ప కళానిలయమైన ఆ మంటపాన్ని పూర్తి చేయకుండా అలాగే వదలివేసిందంటే ఏమనుకోవాలి?
8. ఆవరణం వెలుపల పశ్చిమాన ఒక శిథిల పుష్కరిణి వున్నది. అందులో ఎల్లప్పుడు నీరుంటుంది. ఇది అశుభం.
9. రెండవ ప్రాకారంలో పశ్చిమనైరృతి నడకతో ద్వారమున్నది. పశ్చిమ నైరృతి ద్వారం ద్వారా పయనం అరిష్టాలకు కారణం.
10. రెండవ ప్రాకారం తూర్పు కొలత 40 అడుగుల 6 అంగుళాలు ఉంటే పశ్చిమంలో 74 అడుగుల 6 అంగుళాలు ఉంది. ఇది అశుభం.
11. రెండవ ప్రాకారంలో కూడా ఈశాన్యం మూసి వేయబడింది.
12. ఉత్తరాన ఖాళీ ఏమాత్రము లేదు. (ఉత్తరం కప్పు అష్ట ఐశ్వర్యాలకు ముప్పు).
13. రెండవ ప్రాకారం తూర్పుతో కూడి, ఆగ్నేయం మూత పడడమే గాక వాయవ్యం కూడా మూతపడింది. ‘వాయవ్యం కప్పు స్థిరత్వానికి ముప్పు’.
14. దక్షిణంలో 54 అడుగుల ఖాళీ వుంది. దక్షిణం తెరప అశుభం.
15. ముఖ మంటపానికి పశ్చిమాన విష్ణుమూర్తి ఆలయముంది. దీనికి తూర్పున, ఉత్తరాన ఖాళీ వున్నది. పశ్చిమాన, దక్షిణాన ఖాళీ లేదు. ఈ శుభ లక్షణాల కారణాన ఇచ్చటి ఏ విగ్రహం కూడా విచ్ఛిన్నం చేయబడక చూడముచ్చటగా ఉంది. ఈశాన్యం శూన్యమైన మహా మంటపంలోని ప్రతి విగ్రహం శత్రువుల
ప్రతిఘాతాలకు గురి అయి వికారం గావించబడింది.
ఈవాస్తు వక్రతలు అపురూప, అద్భుత, శిల్పకళలకు కాణాచియైన లేపాక్షి ఆలయాన్ని ఈకలులేని పక్షివలె చేసి దాని పురోగతికి అన్ని విధాల అవరోధాలయ్యాయి.

